Updated : 25/10/2021 05:42 IST

Pawan kalyan: శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి

 ఏ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ ఉండే ఓ రోడ్డుకు మరమ్మతులు చేయండి

జిల్లా అధ్యక్షుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజల కష్టాలు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. మొదట ఆ ప్రాంతం పరిధిలో దెబ్బతిన్న ఒక రోడ్డును గుర్తించి దానికి మరమ్మతులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల సమస్యపై ప్రజాస్వామ్య పద్ధతిలో తొలుత అందరి దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జనసేన పార్టీ శ్రమదానం ద్వారా వాటికి మరమ్మతులు చేపడితే ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రజలందరూ చూశారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన లభించింది. ఇకపై కూడా ఈ శ్రమదానం స్ఫూర్తి కొనసాగించాలి. సగటు మనిషి అభివృద్ధి తద్వారా రాష్ట్రాభివృద్ధి జనసేన లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్ని అయినా ప్రజాకోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో నేను పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తా...’ అని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ శ్రేణుల్ని జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకోవాలని, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్ని ప్రభావవంతంగా నిర్వహించాలని చెప్పారు. పార్టీ మండల, గ్రామ కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

నవంబరు 15 నాటికి మండల కమిటీల నియామకం పూర్తి

జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకం పూర్తయిన జిల్లాల్లో నవంబరు 15వ తేదీ నాటికి మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సమీక్ష కొనసాగింది. అనంతరం వివిధ జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్‌, షేక్‌ రియాజ్‌, పోతిన వెంకట మహేష్‌, మనుక్రాంత్‌రెడ్డి, తదితరులతో కలిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయన వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి డివిజన్‌, వార్డుల్లో పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టాలని తీర్మానించాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్‌, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించాం. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత చిన్న వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపించాలని అధ్యక్షుడు మాకు సూచించారు. పార్టీ క్రియాశీలక సభ్యుల్ని బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం....’ అని కందుల దుర్గేష్‌ వివరించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని