Updated : 03/11/2021 06:06 IST

Pawan kalyan: మూడు రాజధానులు మిథ్యే!

వైకాపా హయాంలోనే గంజాయి సాగు రెట్టింపు

మా శ్రేణులను బెదిరిస్తే పోరాటమే

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల విధానం ఒక మిథ్య అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి కనీసం దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగానైనా మార్చలేకపోయారని దుయ్యబట్టారు. ‘ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది. కొన్నేళ్లుగా ఇది జరుగుతున్నా వైకాపా హయాంలోనే రెట్టింపు అయింది. అది ఎంతకు పెరిగిందనేది పోలీసులే చెప్పాలి’ అని పేర్కొన్నారు.‘గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయి’ అని పవన్‌ కల్యాన్‌ ఆరోపించారు.  ‘విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఈ నాయకులకు భూమి పిచ్చే కనిపిస్తోంది. ముంబయి నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌ నౌకలో తక్కువ మోతాదులో ఓ వ్యక్తి నుంచి మత్తు పదార్థాలు లభ్యమైతే కొన్ని ఆధారాలతో అనుమానించి షారుక్‌ఖాన్‌ కుమారుణ్ని కొద్ది రోజులు జైల్లో పెట్టారు. అటువంటిది ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల గంజాయి బయటకు వెళ్తుంటే ఎంతమంది నాయకులను, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. విశాఖలో మంగళవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. 2024 నుంచి వచ్చే అయిదు సార్వత్రిక ఎన్నికల్లో తమతో పోరాడడానికి సిద్ధమైతేనే బెదిరించండని హెచ్చరించారు.
పిల్లలకు పాలు తాగించినట్లు: చంటి పిల్లలకు పాలు తాగించినట్లు రాష్ట్రంలో మద్యం తాగిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. ‘మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం బూమ్‌బూమ్‌ బీరు తాగుతావా? ప్రెసిడెంట్‌ 2మెడల్‌ తాగుతావా అని అమ్ముతోంది’ అని ఆక్షేపించారు. ‘ఎయిడెడ్‌ పాఠశాలలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. నెల్లూరులో నేను ఇంటర్‌ చదివిన కళాశాలపైనా దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికి మేనమామగా ఉంటానని ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్న ఎయిడెడ్‌ పాఠశాలలను అమ్మేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లు కూడా తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.

దివ్యాంగులతో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

అన్నీ సజ్జలే మాట్లాడతారు: ‘రాష్ట్రంలో వైకాపా మంత్రులు, ఎంపీల పేర్లు ఎవరికీ గుర్తుండవు. ఫలానా మంత్రి ఎవరంటే చాలాసేపు ఆలోచించాలి. ఎంపీల గురించి అడిగితే రఘురామకృష్ణరాజు తప్ప ఇంకెవరూ తెలియరు’ అని పవన్‌ ఆక్షేపించారు. ‘ ఏ శాఖ గురించి స్పందించాలన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడతారు. బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయిన వ్యక్తి ..ఆయన పరిస్థితి వైకాపాలో చాలా దయనీయంగా మారింది. కనీసం హోంమంత్రి, పరిశ్రమలు, ఆర్థికశాఖైనా ఇవ్వలేదు. ఇప్పుడు పురపాలకశాఖ చూస్తున్నా సహాయ మంత్రిలా కొనసాగుతున్నారు. ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పవన్‌ అన్నారు. పలువురు వికలాంగుల బాధలు తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రను సొంత జిల్లాగా చూసుకుంటానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడా కనిపించరని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఓ ప్రమాదంలో మృతిచెందిన క్రియాశీల కార్యకర్త ప్రశాంత్‌ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని