Updated : 12/10/2021 06:24 IST

ammavodi:అమ్మఒడికి విద్యార్థుల హాజరుతో అనుసంధానం

ప్రతి పాఠశాలకు నిర్వహణ ఖర్చుగా రూ.లక్ష
విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: ‘2022 నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలి. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నాం. ఈ ఏడాది నుంచే ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలను చదువుబాట పట్టించాలన్న అమ్మఒడి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభించేటప్పుడే అమ్మఒడి, విద్యాకానుక అందించాలన్నారు. కాబట్టి డిసెంబర్‌కే వర్క్‌ ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఇవ్వనున్న క్రీడా దుస్తులు, బూట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలన్నింటికీ సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) ఉండేలా చూడాలని, 2024 నాటికి సీబీఎస్‌ఈలోనే పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు క్రీడామైదానం తప్పనిసరిగా ఉండాలన్నారు. దీనిపై మ్యాపింగ్‌ చేసి, అన్నింటికీ మైదానాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. క్రమంగా ప్రీహైస్కూల్‌ స్థాయి వరకు క్రీడా మైదానాలుండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.లక్ష అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు, మరమ్మతులకు ఈ నిధి ఉపయోగపడుతుందని అన్నారు.

ఎయిడెడ్‌ బడులపై బలవంతం లేదు

ఎయిడెడ్‌ పాఠశాలల విషయంలో ఎలాంటి బలవంతం చేయటం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ‘వాటిని అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంది. వారే నడపాలనుకుంటే దానికి అభ్యంతరం లేదు. ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టం చేయాలి’ అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మ్యాపింగ్‌ వెంటనే పూర్తి చేయాలని, సబ్జెక్టుల వారీగా బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని సీఎం సూచించారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచటంపైనా దృష్టి పెట్టాలన్నారు.  

పాఠశాలల పనితీరుపై ర్యాంకులు!

సోషల్‌ ఆడిట్‌ ద్వారా పాఠశాలల పనితీరుపై ర్యాంకులు ఇద్దామని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. సంస్కరణల ఉద్దేశాన్ని వారికి స్పష్టంగా చెప్పాలి. ఎక్కడ వెనకబడ్డామో తెలుసుకోవటమే లక్ష్యం కానీ తప్పులు వెతకటానికో, వాటికి బాధ్యులను చేయటానికో ఈ విధానం కాదని వారికి తెలియజేయాలి. అయోమయానికి, గందరగోళానికి తావివ్వద్దు’ అని సూచించారు. ప్రభుత్వ చర్యలతో పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు వివరించారు. ఉపాధ్యాయులందరికీ టీకా ఇవ్వటంతో వారంతా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆగస్టులో విద్యార్థుల హాజరు 73 శాతం ఉంటే.. సెప్టెంబర్‌లో 82, ఈ నెలలో 85 శాతానికి చేరిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 91 శాతంగా ఉందన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని