Ap news: డ్రగ్స్‌ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం

‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని

Updated : 27 Oct 2021 06:31 IST

మాదకద్రవ్యాల ముప్పుపై అప్రమత్తం చేస్తున్నాం

కేసీఆర్‌ వ్యాఖ్యలు సీఎం జగన్‌కు సిగ్గుచేటు

చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: ‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం...’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో మీడియాతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఓ రాజకీయపార్టీగా తమ బాధ్యతని, అందుకే దిల్లీ వచ్చామన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటైన పిల్లలు, యువకులు ఆ వ్యసనం నుంచి బయటపడలేరని, వారి జీవితం అక్కడితో ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు

తమ దగ్గర పార్టీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అడుగుతున్నారని, కరెంటు కోతలు, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గుచేటని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం లేదని, వచ్చిన పన్నులను ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయడం తప్ప ఏం చేయడం లేదన్నారు. సంపద సృష్టించలేని ప్రభుత్వాలు అవసరం లేదని ఓ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ‘సైబరాబాద్‌ నిర్మాణం తెలంగాణకు బంగారు గనిగా మారింది. దానికి మరింత అడ్వాన్సుడుగా అమరావతిలో నవ నగరాలకు ప్రణాళిక వేశాం. అవి పూర్తయితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాబడి వచ్చేది. హైదరాబాద్‌కు మించిన రింగు రోడ్డు నిర్మాణాన్ని అమరావతిలో ప్రతిపాదించాం...’ అని ఆయన వివరించారు. ‘నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, జీనోమ్‌వ్యాలీ వంటి అనేక పనులను ఆ తర్వాత ముఖ్యమంత్రులైన రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కొనసాగించారు. రాజకీయంగా అప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నా వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. అందుకే కోకాపేటలో ఒకప్పుడు రూ.20 వేలు పలికిన ఎకరం ఇటీవల రూ.40 కోట్లు పలికింది...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి రైతులకు అండగా చట్టం

అమరావతిలో రాజధానికి సేకరించిన భూముల్లో అన్ని నిర్మాణాలు పోనూ పది వేల ఎకరాలు మిగిలేది. దానిని విక్రయిస్తే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది...’ అని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆధారంగా రైతులు భూములు ఇచ్చారని, వారికి అండగా చట్టం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధాని మార్చాలంటే ఆ చట్టం ప్రకారం రైతులందరికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.  మారిస్తే అక్కడి రైతులు మాత్రమే నష్టపోరని.. సరైన రాజధాని నగరం, అభివృద్ధి లేక ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడుతుందన్నారు.

భవిష్యత్తులో ఆ అప్పులు కట్టక తప్పదు

రాష్ట్రంలో మద్యం, పెట్రోల్‌ ధరలు ఎక్కువ అవడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుల్లోని ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వాహనాలకు పెట్రోల్‌ పోయించుకొని అక్కడే మద్యం తాగి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ‘మద్య నిషేధానికి లాక్‌డౌన్‌కు మించిన అనువైన సమయం ఉండేది కాదు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం రానున్న 25 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.75 వేల కోట్ల రుణాలు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఎవరూ అధికారంలో ఉన్నా ఆ అప్పులు కట్టక తప్పదు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సరిహద్దులకు దూరంగా ఉన్న ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక, ఇక్కడ మద్యం తాగలేక అక్రమంగా మద్యం తయారు చేసుకుంటున్నారని, గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు అలవాటవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎప్పుడూ చూడని అరాచకాలు

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని అరాచకాలు చూస్తున్నామని చెప్పారు. ‘తెదేపా నాయకులు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసలకు గురిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలపై పలు రకాల కేసులు మోపి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పడంతో పాటు చిత్రహింసలు పెడుతున్నారు. డీజీపీ రాజకీయ ఉగ్రవాదానికి పూర్తిగా కొమ్ముకాస్తున్నారని’ ఆయన ధ్వజమెత్తారు.

పార్టీని పటిష్ట పరుస్తున్నాం

అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి పార్టీపై పెద్దగా శ్రద్ధ పెట్టని మాట వాస్తవమేనని చంద్రబాబు వెల్లడించారు. ‘ప్రస్తుతం పార్టీపై దృష్టి పెట్టాం. అనుభవజ్ఞులు, సీనియర్లను గౌరవిస్తూనే చురుకైన యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. సుమారు పది పదిహేను నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జుల నియామకాల్లో కొంత పోటీ నెలకొంది. దానిపై దృష్టి పెట్టి త్వరలోనే ఇన్‌ఛార్జులను నియమిస్తాం. పార్టీని మరింత పటిష్ట పరుస్తాం. పొత్తులతోనే గెలుపు వస్తుందని అనుకోవడం లేదు. పొత్తులున్నప్పుడు గెలవడంతో పాటు ఓడిపోయాం...’ అని పేర్కొన్నారు.

* మంగళవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని