Updated : 30/09/2021 09:15 IST

వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చేసింది

రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికనే పార్టీలతో పొత్తులు
భవిష్యత్తులో అధికారం సాధిస్తాం
జనసేన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌


ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించాలి? మరి వైకాపా అధినాయకత్వం ఏం చేస్తోంది? వీళ్లు ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్డు వేశారా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే పన్నుల ఆదాయం రూ.1.29 లక్షల కోట్లు వస్తోంది. ఆ సొమ్ములు ఏం చేస్తున్నారు? జీతాలు ఇవ్వరు, పింఛన్లు మూడో వారానికీ ఇవ్వరు.


ఈనాడు, అమరావతి: ‘వంద మంది పన్నులు కడితే ఆ మొత్తం కొద్దిమందికే పంచుతామంటే మిగతావారు ఊరికే కూర్చుంటారా? దిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ విషయం చెబుతూనే ఉన్నా. వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘రాయలసీమలో కొన్నిచోట్ల దళితుల హక్కులను కాలరాస్తున్నారు. బోయ కులస్తులు సాధికారత లేదని ఇబ్బంది పడుతున్నారు. నేను కులాల ఐక్యత కావాలని చెబుతున్నా. ఒకరిపై కక్ష పెట్టుకుని ముందుకు వెళ్తే అది సమూలంగా అందరినీ దహిస్తుంది. వైకాపా చేస్తున్న తప్పు అదే. వారు వర్గ శత్రువుగా ప్రకటించుకున్న వారితో పోరాటంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని తగలబెట్టేస్తున్నారు’ అని విమర్శించారు. ‘నాకు సరైన సైద్ధాంతికత లేదని, సందిగ్ధంగా ఉంటానని అడుగుతారు.
ఒకసారి ఒక మాట చెబుతావు. తర్వాత మరో పార్టీతో కలుస్తావేంటని నన్ను ప్రశ్నిస్తారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా ఇదంతా ఒక వ్యూహం. అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తుంటా’ అని ఆయన ప్రకటించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన పరిణామాన్ని గుర్తుచేస్తూ ప్రజలు లక్షలమంది అండగా నిలబడినా వదిలేసి వెళ్లినందుకు క్షమాపణ కోరారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినా, రాకపోయినా ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఆ నమ్మకం ఉంటే గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తా అని ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే...

* ఏపీ ప్రభుత్వశాఖలకు చెబుతున్నా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి. వైకాపాకు వచ్చిన 151 సీట్లు 15కి తగ్గబోతున్నాయి. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తాం.
* ఎంతసేపూ రాజకీయం రెండువర్గాల మధ్యే ఉంటుందా? స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాతైనా మిగతా వర్గాల గురించి ఆలోచించాలి. ఒక్కరే పెత్తనం చలాయిస్తామంటే కుదరదు. వైకాపా కమ్మ సమాజంపై దాడి చేస్తోంది. కశ్మీరీ పండిట్లను తరిమేసినట్లు ఒక జాతిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమేద్దామనుకుంటే కుదురుతుందా? అలాంటి దాడుల బాధితులకూ జనసేన అండగా ఉంటుంది.
* మా వాళ్ల తలకాయలు పగలగొడుతున్నారు. మధుసూదన్‌రెడ్డి వంటివారిపై కేసులు పెడుతున్నారు. దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇక ఆంధ్రరాష్ట్రం నుంచి వైకాపాను పంపించే సమయం ఆసన్నమయింది. నా వర్గ శత్రువు ఎవరంటే.. దౌర్జన్యాలు చేసేవారే.
* రాజకీయ చదరంగంలో జనసేన ప్రయాణం ఒక పావు. పాములన్నీ కప్పేసి ఉన్నాయి. ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తున్నా. ఒక ఎమ్మెల్యే, 180 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాలు సంపాదించాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సాధించబోతున్నాం.
వైకాపా అధినేతకు రూ.700 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏ రోజైనా సైనిక బోర్డుకు రూ.కోటి ఇచ్చారా? పిల్లికి బిచ్చమేశారా? మీరా మాట్లాడేది?

రాజకీయంగా ఎదుర్కోలేకే విమర్శలు: నాదెండ్ల మనోహర్‌

పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళగిరిలో బుధవారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వర్గాల మధ్య చిచ్చు పెట్టి వైకాపా ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. పార్టీ నాయకులు ముత్తా శశిధర్‌, హరిప్రసాద్‌, మనుక్రాంత్‌ రెడ్డి, బొలిశెట్టి సత్య, టి.శివశంకర్‌, కందుల దుర్గేష్‌, చేగొండి ప్రకాష్‌, కల్యాణం శివ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని