AP HighCourt: పోలీసులది అత్యుత్సాహం

రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు శనివారం నిప్పులు చెరిగింది. ‘చట్టబద్ధ పాలన అంటే వారికి గౌరవం లేదు. హైకోర్టు జడ్జిలు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపని పోలీసులు..

Updated : 24 Oct 2021 04:28 IST

హైకోర్టు జడ్జీలను దూషించినా వేగంగా చర్యల్లేవే!
ముఖ్యమంత్రి విషయంలో అంత ఉత్సాహమెందుకు?
గౌరవం, ప్రతిష్ఠ సీఎంకే కాదు.. అందరికీ ఉంటాయి
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. పట్టాభికి బెయిలు మంజూరు, విడుదల
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు శనివారం నిప్పులు చెరిగింది. ‘చట్టబద్ధ పాలన అంటే వారికి గౌరవం లేదు. హైకోర్టు జడ్జిలు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో తెదేపా నేత పట్టాభి అరెస్టు విషయంలో అంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది? గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్నీ కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. ముఖ్యమంత్రి అయినా సరే! పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరంతో న్యాయస్థానం ముందుకు రోజూ పలు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయి. మేమూ గమనిస్తున్నాం. పట్టాభిరామ్‌ అరెస్టులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓ వైపు అరెస్టు చేయడానికి పట్టాభి ఇంటికి వెళ్లామని చెబుతూ.. మరోవైపు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసు ఇచ్చాం, సహకరించలేదు, అందుకే అరెస్టు చేశామంటూ పరస్పర విరుద్ధమైన, పొంతన లేని వివరాలను దర్యాప్తు అధికారి రిమాండు రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యాసదృశం కాదా? అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే 41ఏ నోటీసు ఎందుకిచ్చారు? ఆ నోటీసు ఇచ్చాక మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసుల తీరు ఉంది’ అని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారా.. లేదా... అనే అంశంపై పోలీసులు, రిమాండుకు పంపిన విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన తెదేపా నేత పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.20వేల బాండుతో రెండు పూచీకత్తులు దిగువ కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. బెయిలు ఇవ్వొద్దన్న ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

నిబంధనలను పాటించలేదు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై పరుష పదజాలం ఉపయోగించి గొడవలకు కారకులయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెదేపా నేత పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న పట్టాభి.. బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ను అరెస్టుచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి. నోటీసు ఇచ్చామని పోలీసులు చెబుతున్నా.. నిబంధనలను పాటించలేదు. 41ఏ నోటీసు పట్టికలో ఖాళీలు ఉండటంపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. నోటీసుపై అభ్యంతరం ఉన్నప్పుడు రిమాండ్‌కు ఇవ్వకుండా ఉండాల్సింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. పిటిషనర్‌కు బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు.

ఆ సెక్షన్లు సరైనవే
పోలీసుల తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘నమోదు చేసిన సెక్షన్లు సరైనవే. ముఖ్యమంత్రిపై పిటిషనర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పిటిషనర్‌ ప్రెస్‌మీట్‌ వీడియోను పరిశీలించండి. బెయిలు ఇవ్వొద్దు. ఇస్తే పబ్లిక్‌ ఆర్డర్‌ ఉల్లంఘన అయ్యే అవకాశం ఉంది’ అని కోరారు.

ఎవరికైనా ఒకే విధానం
రిమాండు రిపోర్టులోని వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 41ఏ నోటీసు విషయంలో దర్యాప్తు అధికారి పరస్పర విరుద్ధమైన వివరాలు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. చట్ట నిబంధనల మేరకు పోలీసులు వ్యవహరించలేదన్నారు. ‘దూషణలకు పాల్పడ్డ నిందితులు చేసింది తప్పా, ఒప్పా? అని ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ వారి విషయంలో అనుసరించాల్సిన విధానం ఒకటి ఉంది. దాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. సీఎం, హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ తదితరులను దూషించిన వారి పట్ల ఎలా వ్యవహరించాలో చట్టంలో ఒకే విధానం ఉంది’ అన్నారు. ‘ఉదాహరణకు నన్నే ఎవరైనా దుర్భాషలాడితే.. ఆ వ్యక్తులను తీసుకెళ్లి ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉంచడం సబబేనా’ అని ప్రశ్నించారు. పిటిషనరు పట్టాభికి బెయిలు మంజూరు చేశారు.


బెయిలుపై పట్టాభి విడుదల

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో... రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న పట్టాభిని తీసుకెళ్లేందుకు ఆయన వ్యక్తిగత సిబ్బంది శనివారం సాయంత్రం జైలుకు వచ్చారు. బెయిలు పత్రాలు సమర్పించడంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన్ను విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు. విడుదలైన ఆయన తన కారులో బయలుదేరి విజయవాడ వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని