Chandrababu: క్లెమోర్‌మైన్స్‌ పేలుళ్లకూ చలించని నేత

మావోయిస్టులు క్లెమోర్‌ మైన్స్‌తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు.

Updated : 20 Nov 2021 09:42 IST

అవమానభారంతో కన్నీరు మున్నీరైన వేళ

ఈనాడు, అమరావతి: మావోయిస్టులు క్లెమోర్‌ మైన్స్‌తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన కన్నీరు పెట్టడం సహచరులెవరూ చూడలేదు. శుక్రవారం శాసనసభలో జరిగిన అవమానంతో చలించిపోయి తెదేపా అధినేత చంద్రబాబు రోదించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కొత్తకాదు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. దీటుగా నిలబడ్డారు. కానీ నిండుసభలో... వైకాపా ఎమ్మెల్యేలు తన భార్యపై వ్యక్తిత్వ హననానికి పాల్పడం, ఆమెను కించపరిచేలా అత్యంత అవమానకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కుంగిపోయారు.

కట్టలు తెగిన ఆవేదన

అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగాక స్పీకర్‌ సభను వాయిదా వేయడంతో చంద్రబాబు తన ఛాంబర్‌లోకి వచ్చి కూర్చున్నారు. ఆప్పటికే ఆయన ముఖం అవమానభారంతో ఎరుపెక్కింది. అప్పటికీ ఉబికివస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కాసేపు యాంటీరూమ్‌లోకి వెళ్లి వచ్చారు. చంద్రబాబును చూస్తూనే శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు... ఆయన కాళ్లకు నమస్కరించి, కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో సుడులు తిరుగుతున్న బాధ ఆగలేదు. వారి ముందే భోరున విలపించారు. అంత అవమానం జరిగాక... ఇక సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. సభలోనే తన ఆవేదన వెల్లడించి... బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో మళ్లీ సభలోకి వెళ్లారు. స్పీకర్‌ మైక్‌ ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదన తెలియజేస్తున్నా... అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పూర్తిగా మాట్లాడక ముందే... స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో, ఆయన తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి అవమానభారంతో నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక పదేపదే భోరున విలపించారు.

చెక్కుచెదరని ధైర్యం చలించిన వేళ..

దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి... పిన్న వయసులోనే మంత్రిగా, నాలుగు పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించిన నేపథ్యం చంద్రబాబుది. ఆ ప్రస్థానంలో ఆయన అనేక ఎదురుదెబ్బలూ తిన్నారు. అయినా ఎప్పుడూ చలించలేదు. 1983లో చంద్రగిరిలో ఓడిపోవడం ఆయనకు రాజకీయంగా తగిలిన మొదటి ఎదురుదెబ్బ. తర్వాత అనేక ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1989లో పార్టీ ఓడిపోయినా... డీలా పడకుండా, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకూ అవిశ్రాంత పోరాటం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనప్పుడూ పోరాటం ఆపలేదు. ఆరు పదుల వయసులోనూ సుదీర్ఘ పాదయాత్ర చేసి... పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తిరుపతిలో అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌ పేల్చినప్పుడు తీవ్రంగా గాయపడ్డా ఆయన భయపడలేదు. కంటి నుంచి చుక్క నీరు రాలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడూ ఆయన కుంగిపోలేదు. వెంటనే తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షల్ని, పార్టీ నాయకులపై పెడుతున్న కేసుల్ని, కార్యకర్తలపై వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డారు. చివరకు పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినా చలించలేదు. అలాంటి నాయకుడు... శాసనసభలో జరిగిన అవమానంతో పొగిలి పొగిలి ఏడవడంతో ఆయన సహచరులు, పార్టీ నాయకులు చలించిపోయారు.

పార్టీ కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం

విలేకరుల సమావేశంలో చంద్రబాబు విలపించడాన్ని టీవీల్లో చూసి తీవ్ర ఆవేదనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్‌ తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని అధినేతతో సమావేశమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై... కార్యకర్తలు నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో... వైకాపా జెండాలు, ఆ పార్టీ నాయకుల చిత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని