Updated : 23/11/2021 06:00 IST

AP 3 Capitals: 3 రాజధానులపై మళ్లీ బిల్లు

ప్రస్తుత చట్టాలను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
పాత సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి..
ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
ఆమోదించిన శాసనసభ
4గంటల్లోనే చకచకా పరిణామాలు
ఈనాడు - అమరావతి

అనూహ్య పరిణామాలు...
4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ..
చివరకు 3 రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
సమగ్ర వివరాలతో మళ్లీ బిల్లు తెస్తామన్న సీఎం జగన్‌
ఇవీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు..

శాసనసభ సమావేశానికి టీ విరామం ప్రకటించిన స్పీకర్‌... వరదలపై సీఎం జగన్‌ సమీక్ష.. అంతలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారంటూ సమాచారం.. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరుగుతుండగానే.. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయనుందని హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్‌ జనరల్‌.. ఈ కీలక పరిణామాలన్నీ సుమారు నాలుగు గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు చట్టాల్ని ఉపసంహరించుకోబోతున్న విషయం ఏ మాత్రం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మంత్రివర్గం అత్యవసరంగా ఎందుకు సమావేశమైందన్న ఉత్కంఠ కొనసాగుతుండగానే ఉదయం 11.30 గంటల సమయంలో రెండు చట్టాల రద్దు గురించి ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. సచివాలయంలో సుమారు 11.50కి మంత్రివర్గ సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభమైన కాసేపటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు (ఆంధ్రప్రదేశ్‌ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి) ఏర్పాటు చేస్తూ 2020లో తీసుకొచ్చిన చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) రద్దు చట్టాన్నీ ఉపసంహరించుకుంటూ బిల్లు ప్రవేశపెట్టారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచన మేరకు దానిలో ముఖ్యాంశాల్ని వివరిస్తూ ప్రసంగించారు.
అనంతరం .. మూడు రాజధానుల అవసరాన్ని ప్రజలకు వివరించి, మరింత సమగ్రంగా మెరుగైన బిల్లు ప్రవేశపెట్టేందుకే ఆ రెండు చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ వెంటే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. మండలి ఆమోదం కూడా పొందాక దాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. మరోవైపు మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... ఆశావహ దృక్పథంతో కనిపించిన అమరావతి రైతులు వికేంద్రీకరణపై మెరుగైన బిల్లు ప్రవేశపెడతామన్న ప్రభుత్వ ప్రకటనతో నిరుత్సాహపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేవరకూ రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


తాజా బిల్లులో ఏముందంటే..

2014లో ఆమోదించిన సీఆర్‌డీఏ చట్టం మళ్లీ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తాజా బిల్లులో పేర్కొంది. ‘అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)కి చెందిన అన్ని రకాల ఆస్తులు, అప్పులు సీఆర్‌డీఏకి బదిలీ అవుతాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే.. ప్రస్తుతం ఏఎంఆర్‌డీఏలో ఉన్న ఉద్యోగులంతా సీఆర్‌డీఏ ఉద్యోగులుగా మారిపోతారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘భాగస్వాములు (స్టేక్‌హోల్డర్స్‌) అందరితో మరోసారి సంప్రదింపులు జరిపేందుకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకుని, చట్ట నిబంధనల్ని మరింత మెరుగుపరుస్తూ మరోసారి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా.. ఇంతకుముందున్న రెండు చట్టాల్ని ప్రభుత్వం రద్దు చేస్తోంది. బహుళ రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనకున్న సదుద్దేశాల్ని అందరికీ వివరిస్తాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు, శ్రీబాగ్‌ ఒప్పందంలోని హామీల్ని నెరవేర్చేందుకు, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ప్రాంతీయ ఉద్యమాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అప్పట్లో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని తీసుకొచ్చిందన్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రయోజనాల్నీ కాపాడేందుకు ఆ చట్టాల్లో చర్యలు తీసుకున్నామన్నారు. కానీ భాగస్వాముల అభిప్రాయాన్ని వినిపించేందుకు తగిన అవకాశం ఇవ్వలేదంటూ ఆ చట్టాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయని బుగ్గన పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే మరింత సమగ్రంగా బిల్లు ప్రవేశపెట్టేందుకు.. ఆ చట్టాల్ని రద్దు చేస్తున్నామని వెల్లడించారు.


బిల్లు నుంచి బిల్లు దాకా..

2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం
2014 డిసెంబరు 23: ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ
2019 డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం జగన్‌ ప్రకటన
2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ  చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ
2020 జూన్‌ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
2021 నవంబరు 22: కొత్త బిల్లు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని