Updated : 24/11/2021 05:17 IST

BC Census: బీసీ కులాల జనగణన చేపట్టాలి

 కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
 శాసనసభలో తీర్మానం ఆమోదం
గణనతో వెనుకబాటు విషయం తెలిస్తే.. చర్యలు తీసుకోవచ్చన్న సీఎం

ఈనాడు, అమరావతి: బీసీ జనగణన చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసనసభలో మంగళవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సభ చర్చించి ఆమోదించింది. తీర్మానంపై చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ‘దేశంలో కులాలు ఉన్నాయన్న వాస్తవాన్ని అందరం అంగీకరిస్తున్నాం. జనగణనలో మాత్రం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు బీసీ జనాభా లెక్కలు సేకరించలేదు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎంత వెనుకబాటు ఉందో తేలిస్తే ఎంత మేరకు చర్యలు తీసుకోవాలన్న స్పష్టత ప్రభుత్వాలకు వస్తుంది. సమాజంలో కులాల పరంగా తమకు మరింత న్యాయం చేయాలనే డిమాండ్లు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానం అంటూ ఏదీ లేదు, ఉండదు. కాబట్టి ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఆ డిమాండ్‌కు శాసనసభ తరఫున మద్దతు తెలుపుతూ తీర్మానం చేస్తున్నాం’ అని సీఎం ప్రకటించారు.

* బ్రిటిష్‌ హయాంలో 1931లో బీసీల కులాల వారీ జనగణన జరిగింది. ఈ సారి జనగణన సందర్భంగా ప్రతి ఒక్కరినీ వారి కులం ఏమిటో కేంద్ర ప్రభుత్వమే అడిగేలా ఒక కాలమ్‌ పెట్టి డేటా సేకరించాలని వచ్చిన డిమాండ్లను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆగస్టులో తిరస్కరించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ డిమాండ్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సైతం ఈ డిమాండ్‌పై తీర్మానం చేస్తోంది.
* ఏలూరులో పార్టీ తరఫున నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో బీసీలంటే ‘బ్యాక్‌ వర్డు క్లాస్‌’ కాదు, ‘బ్యాక్‌ బోన్‌ క్లాస్‌’గా మారుస్తామని చెప్పాం. అందుకు చర్యలు తీసుకున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక గెలిచిన, గెలవబోతున్న ఎమ్మెల్సీలు 32 మంది. వీటిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. నలుగురిని రాజ్యసభకు పంపాం. అందులో ఇద్దరు బీసీలే. శాసనసభ స్పీకర్‌ పదవి కూడా బీసీలకు ఇచ్చాం. మండలి ఛైర్మన్‌గా తొలిసారి దళితులకు అవకాశం ఇచ్చాం. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 635 మండల పరిషత్తుల్లో 67 శాతం, 13 జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పదవుల్లో 69శాతం, 13 నగరపాలక సంస్థల మేయర్ల పదవుల్లో 92 శాతం ఇచ్చాం. గెలుచుకున్న 84 మున్సిపాలిటీల్లో 73 శాతం ఇచ్చాం. 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవుల్లో 60 శాతం ఇచ్చాం. 56 ప్రత్యేక కార్పొరేషన్లు బీసీల కోసం ఏర్పాటు చేశాం.

* తెదేపా పాలనలో బీసీలనూ విభజించారు. ఓటు వేసిన వారు, వేయని వారంటూ విభజించి పథకాలు అమలు చేశారు.

సరైన గణాంకాలు అవసరం: అంతకుముందు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు సంబంధించి సరైన గణాంకాలు లేక సరైన సంక్షేమ చర్యలకు ప్రతిబంధకంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్‌ ఈ రెండున్నరేళ్లలో బీసీలకు ఎంతో చేశారన్నారు. ఒడిశా, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర కూడా బీసీ జనగణన చేపట్టాలని కోరుతున్నాయన్నారు. ఈ రెండున్నరేళ్లలో బీసీలకు ప్రభుత్వం రూ.76,275 కోట్ల మేర ప్రయోజనం కల్పించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ శాసనసభలో ఈ తీర్మానం చేస్తారని తెలిసి కూడా తెదేపా సభ్యులు లేకపోవడంపై ఆలోచించాలన్నారు. అది బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీసీ జనగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెదేపా, భాజపా, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని కోరారు. ఈ తీర్మానంపై చర్చలో కరణం ధర్మశ్రీ, ఉషశ్రీ, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని