Police Station: పోలీస్‌ స్టేషన్‌లో ‘పెన్సిల్‌’ పంచాయితీ

‘నా పెన్సిల్‌ ఎత్తేసినవ్‌, నీపై పోలీస్‌ స్టేషన్ల కేసు పెడతానంటూ’ మూడో తరగతి పిల్లాడు ఒకరు తోటి విద్యార్థిని మిత్రుల సాయంతో ఠాణాకు లాక్కెళ్లిన ఘటనపై ఉన్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయించింది.

Updated : 26 Nov 2021 14:38 IST

కేసు పెట్టాలన్న  మూడో తరగతి విద్యార్థి  
రాజీ కుదిర్చి, పంపించిన పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ 

పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ‘నా పెన్సిల్‌ ఎత్తేసినవ్‌, నీపై పోలీస్‌ స్టేషన్ల కేసు పెడతానంటూ’ మూడో తరగతి పిల్లాడు ఒకరు తోటి విద్యార్థిని మిత్రుల సాయంతో ఠాణాకు లాక్కెళ్లిన ఘటనపై ఉన్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయించింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు తమ గొడవను పోలీసుల ఎదుటకు తీసుకెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన విద్యార్థి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న మిత్రుడు రోజూ తన పెన్సిల్‌ను తీసేసుకుంటుండటంతో విసిగిపోయాడు. అతన్ని స్నేహితుల సాయంతో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లాడు. న్యాయం చేయాలని కానిస్టేబుల్‌ ఎదుట పంచాయితీ పెట్టాడు. కేసు పెడితే బెయిల్‌ తెచ్చుకోవడం, తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడం ఉంటాయని... అవన్నీ కష్టమని, ఈ ఒక్కసారికి పెద్దమనసు చేసుకుని అతన్ని క్షమించాలని కానిస్టేబుల్‌ సూచించారు. బాగా చదువుకోవాలని సూచిస్తూ... ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ ఘటన ఆరు నెలల కిందట చోటుచేసుకుంది. అప్పుడు ఈ పిల్లల పంచాయితీని ఒకరు సరదాగా వీడియో తీశారు. ఇటీవల వాళ్ల పిల్లలు దీన్ని పొరపాటున ఎవరికో షేర్‌ చేయగా... అది అలా అలా పది మందికీ చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని