Rakesh Tikait: ఈ పోరు ఆగదు

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా.. దేశంలో వ్యవసాయరంగం కుదుటపడలేదని, రైతులు నిత్య సమస్యలను ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు.

Updated : 26 Nov 2021 05:18 IST

రైతులకు న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటాం
పంజాబ్‌ తరహా సేకరణ అన్ని రాష్ట్రాల్లో ఉండాలి
వ్యవసాయానికి ప్రత్యేక మంత్రి మండలి అవసరం  
‘ఈనాడు’ ఇంటర్య్వూలో రాకేశ్‌ టికాయిత్‌

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా.. దేశంలో వ్యవసాయరంగం కుదుటపడలేదని, రైతులు నిత్య సమస్యలను ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తాము వెన్నంటి ఉంటామన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఏడాది పాటు అన్నదాతలు పోరాడారన్నారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒప్పంద సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. గోదాములన్నీ అంబానీ, ఆదానీలకు ఇచ్చేస్తున్నారని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరతో పాటు పంజాబ్‌ తరహాలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రకాల పంటలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానం ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగుకు పెట్టుబడిగా ఇస్తున్న రైతుబంధు మంచి పథకమని, దానిని దేశమంతటా అమలు చేయాలంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. వ్యవసాయం ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేక మంత్రి  మండలి ఉండాలన్నారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేసింది కదా.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి?

కేంద్రం కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే నల్ల చట్టాలు తెచ్చింది. వాటి రద్దు ఉద్దేశాలపైనా మాకు సందేహాలున్నాయి. ఇవే కాదు ఇంకెన్నో రకాలుగా రైతులకు అన్యాయం జరుగుతోంది. పంటలకు గిట్టుబాటు లేదు. 1967లో గోధుమ ధర క్వింటాలుకు రూ. 70. ఇప్పటి ఖర్చులతో పోలిస్తే అది రూ. 7,600 కావాలి. అయితే రెండు వేలకు మించడం లేదు. రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కితేనే వ్యవసాయానికి మేలు. దీని కోసమే మా ప్రయత్నం. స్వామినాథన్‌ కమిషన్‌ 200 సిఫార్సులు చేస్తే ఒక్కటీ అమలు చేయలేదు. వ్యవసాయానికి సంబంధించి 18 ప్రభుత్వ శాఖలున్నాయి. వాటి మధ్య సమన్వయమే లేదు. ఈ శాఖలన్నింటితో కలిసి వ్యవసాయానికి ప్రత్యేక మంత్రిమండలి (కేబినెట్‌) ఉండాలి. అన్ని శాఖల మంత్రులు ఒకేచోట కూర్చొని సమస్యలను పరిష్కరించాలి.

పంటల కొనుగోలు విధానం ఎందుకు అమలు కావడం లేదు?

పంటల సేకరణ బాధ్యత కేంద్రానిదే. కానీ భాజపా అధికారంలో ఉన్నచోట ఒకలా.. ఇతర ప్రభుత్వాలు ఉన్నచోట మరోలా వ్యవహరిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కేంద్రం చేతుల్లోనే ఉంది. పంజాబ్‌లో వరి, గోధుమలను కొంటోంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని పంటలను కొనాలనే మేం ఉద్యమిస్తున్నాం.

దేశంలో గోదాముల కొరత అని చెబుతోంది కదా..

గోదాములన్నింటినీ ఆదానీ, అంబానీలకు కేంద్రం అమ్మేసింది. రైళ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు.. ఇలా మొత్తం దేశాన్ని అమ్మేస్తోంది.

పంట మార్పిడి జరగాలని కేంద్రం చెబుతోంది?

దీనిపై ప్రస్తుతం కేంద్రంలో స్పష్టమైన విధానమే లేదు. నిజంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని భావిస్తే వాటికి ప్రోత్సాహకాలు, రాయితీల కేంద్రమే ఇవ్వాలి. యూరప్‌లో పంట మార్పిడికి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. పంట పరిహారం విధానం కూడా విదేశాల్లో బాగుంది.  

కనీస మద్దతు ధర సాధ్యం కాదని అంటోంది కదా..

పంటల కొనుగోలు కేంద్రానికి భారం కాదు. వ్యాపారులు రైతుల వద్ద కొని దానిని లాభంతో ప్రభుత్వానికి విక్రయిస్తుంటారు. ఇదెలా జరుగుతోంది? ఈ అవినీతి అంతం కావాలంటే కనీస మద్దతు ధర అన్నదాతకు హక్కుగా మారాలి.

ఏ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగ్గా ఉంది?

అన్ని రాష్ట్రాల్లోనూ వారు మెరుగుపడాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం అభినందనీయం. దీంతో పాటు నిరంతర ఉచిత విద్యుత్‌ను ఇవ్వడం రైతులకెంతో మేలు. ఈ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం కోరాం. వీటన్నింటిని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అందజేస్తాం. దేశవ్యాప్తంగా రైతులకు నేరుగా నగదు బదిలీ కోసం ఆందోళన చేస్తాం.

మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?

త్వరలోనే సంయుక్త కిసాన్‌మోర్చా సమావేశం ఉంది. దానిలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం.


దేశరాజధానిలో ఏడాది పాటు ఆందోళన ఎలా సాధ్యమైంది?  

కేంద్రం కుట్రపూరితంగా కరోనా సమయంలో చట్టాలు చేసి అన్నదాతలను భయపెట్టాలని చూసింది. అయినా ఎవరూ భయపడలేదు. మున్ముందూ ఇదే పోరాట పంథా ఉంటుంది. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలి. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా చట్టం తేవాలి. విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలి. విత్తన బిల్లు తేకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తోంది. మా డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతాం.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని