Updated : 01/12/2021 05:21 IST

Vidya Deevena: కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత తల్లులదే

ప్రభుత్వం బోధన రుసుములు జమచేసిన వారం, పది రోజుల్లో కట్టాలి

లేనిపక్షంలో తదుపరి విడత నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పదు: సీఎం జగన్‌

11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల విద్యా దీవెన నిధుల విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘జగనన్న విద్యాదీవెన కింద బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన బోధన రుసుముల్ని వారం.. 10 రోజుల్లో కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లులపై ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు అందినా చెల్లించకపోతే తదుపరి విడతలో నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తల్లులు ప్రతి 3 నెలలకోసారి కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లించి.. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారని, వసతులనూ పరిశీలిస్తారని చెప్పారు. జగనన్న విద్యాదీవెనలో భాగంగా మూడోవిడత బోధన రుసుముల్ని సీఎం మంగళవారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 11.03 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసమే రూ.6,259 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఇందులో గత ప్రభుత్వ బకాయిలు రూ.1,778 కోట్లు ఉన్నాయని తెలిపారు.

80% స్థూల ప్రవేశాల నిష్పత్తి లక్ష్యం: ‘విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల ఉన్నతవిద్య సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2020 నాటికి 17-23 ఏళ్ల మధ్య కళాశాలల్లో చేరే విద్యార్థుల స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్‌) 35.2 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 2018-19.. 2019-20 మధ్య జీఈఆర్‌ పెరుగుదల 3.04% కాగా.. రాష్ట్రంలో 8.6% నమోదైంది. ప్రతి అడుగూ దేశం కన్నా మెరుగ్గా వేస్తున్నాం. రాష్ట్రంలో కనీసం 80% పైచిలుకు జీఈఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని చేరుకోవడానికి ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది’ అని వివరించారు. ‘చదువుకు పేదరికం అడ్డం కాకూడదని ప్రైవేటు యూనివర్సిటీల్లో వైద్యవిద్యలో 50%, ఇంజినీరింగ్‌, డిగ్రీ కోర్సుల్లో 35% ప్రవేశాలు కన్వీనర్‌ కోటాలో భర్తీచేసేలా చట్టం చేశాం. ఫలితంగా ఈ ఏడాది దాదాపు 2,118 మందికి అవకాశం దక్కింది. వీరికి పూర్తి బోధన రుసుములు ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు గతానికి భిన్నంగా ప్రైవేటు వర్సిటీల్లోనూ అవకాశం వచ్చింది’ అని వివరించారు.

గిరిజన వర్సిటీకి త్వరలో శంకుస్థాపన: ‘ఉన్నతవిద్య చదివించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక్కటే చాలదు. వసతి, ఆహార ఖర్చుల కోసం జగనన్న వసతిదీవెన పథకాన్ని తీసుకొచ్చాం. దీనిద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివేవారికి రూ.20వేల చొప్పున ఇస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.2,267 కోట్లు విడుదల చేశాం. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకే రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం. ఉన్నతవిద్యలో పెనుమార్పులు తెస్తున్నాం. కొత్తగా 16 బోధనాసుపత్రులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. విజయనగరం జిల్లాలో గురజాడ జేఎన్టీయూ, ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి వర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్‌ వర్సిటీని తీసుకొస్తున్నాం. కర్నూలులో క్లస్టర్‌ వర్సిటీని నెలకొల్పుతున్నాం. కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల, పాడేరులో బోధనాసుపత్రి, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం’ అని తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని