Updated : 01/12/2021 05:24 IST

CBI: జగన్‌ కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్ల పెట్టుబడులు

అందుకే 12 వేల ఎకరాల ప్రాజెక్టు కేటాయింపు

వాన్‌పిక్‌ కేసులో సీబీఐ వాదన

ఈనాడు - హైదరాబాద్‌

జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.17వేల కోట్ల విలువైన వాన్‌పిక్‌ ప్రాజెక్టును కేటాయించిందని సీబీఐ మంగళవారం హైకోర్టుకు నివేదించింది. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు ఏవీ లేకుండానే 12 వేల ఎకరాలను ప్రాజెక్టు పేరుతో పొందారని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ... ‘మొత్తం కేసును కలిపి చూడాలి. అందరూ కలిసి కుట్ర పన్నారు. నిందితుల పాత్రను విడివిడిగా చూడరాదు. బాంబు తయారీ నిమిత్తం ఒక వ్యక్తి డబ్బు సమకూరిస్తే... కేవలం డబ్బు ఇచ్చానని ఒకరు, కొరియర్‌గా డబ్బు అందించానని మరొకరు, డబ్బిస్తే బాంబు తయారీ సామగ్రి ఇచ్చానని ఇంకొకరు, తయారు చేసి ఇవ్వమన్నారని, ఫలానా ప్రాంతంలో బాంబు పెట్టామని చెబితే పెట్టానని వేరొకరు.. ఇలా ఎవరికి వారు విడిగా చెబితే ఎవరూ తప్పుచేయనట్లే. ఇలా విడివిడిగా చూస్తే తమకు సంబంధంలేదంటారు. బ్యాంకు కుంభకోణాలతో సహా కుట్రలో అందరి పాత్రను కలిపి చూడాలి. జగన్‌, సాయిరెడ్డిలు అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. వారు జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏసియా, రఘురాం సిమెంట్స్‌ ఇలా సంస్థలను ముడుపులు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు..’ అని సీబీఐ వివరించింది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వ్యక్తులు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే.. ఆయన తండ్రి వై.ఎస్‌. ఆ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రాజెక్టులు అప్పగిస్తారని పేర్కొంది.

కుట్రకు ఒక్క ఆధారమూ లేదు

అంతకుముందు వాన్‌పిక్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ... ‘జగన్‌, వైఎస్‌తో కలిపి పిటిషనర్లు కుట్ర పన్నారనడానికి ఒక్క ఆధారాన్ని సమర్పించలేదు. కేవలం సంఘటనల ఆధారంగా కుట్ర పన్నారని చెబుతున్నారు. మంత్రి మండలిని ఒక వ్యక్తి ప్రభావితం చేయజాలరు. మంత్రి మండలిని పార్టీ అధ్యక్షుడు కూడా ప్రభావితం చేయలేరు..’ అని వివరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నించజాలరని, కోర్టులు కూడా జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలన్నీ రస్‌ ఆల్‌ ఖైమా (రాక్‌)కేనని, ఏజంటుగా తాము వ్యవహరించినట్లు చెప్పారు. జగన్‌ కంపెనీల్లో రూ.497 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టామన్నారు. ఈ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని