Polavaram: 2022 ఏప్రిల్‌ నాటికి పోలవరం కష్టమే

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్థితిని బట్టి చూస్తే అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రాజెక్టుకు కొత్త షెడ్యూల్‌ను సూచించడానికి 2021 నవంబర్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని

Updated : 07 Dec 2021 17:06 IST

కొత్త షెడ్యూల్‌ ఖరారుకు కమిటీ ఏర్పాటు

ప్రాజెక్టు సాగునీటి పనులకు సవరించిన అంచనా వ్యయం రూ.35,950 కోట్లు

పీపీఏ సిఫార్సు తర్వాత దీనికి పెట్టుబడి అనుమతి తీసుకుంటాం

రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ఈనాడు - దిల్లీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్థితిని బట్టి చూస్తే అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రాజెక్టుకు కొత్త షెడ్యూల్‌ను సూచించడానికి 2021 నవంబర్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని సవరించిన అంచనాల (రివైజ్డ్‌ కాస్ట్‌) కమిటీ 2020 మార్చిలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిఫార్సుల తర్వాత దీనికి పెట్టుబడి అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలపై సోమవారం రాజ్యసభలో వైకాపా నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ ఈ మేరకు సమాధానమిచ్చారు.

‘2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల పోలవరం సాగునీటి ప్రాజెక్టు రెండో సవరించిన అంచనాలకు 2019 ఫిబ్రవరిలో జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్‌, ఫ్లడ్‌ఫ్లో కంట్రోల్‌, మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్స్‌ అడ్వయిజరీ కమిటీ తన 141వ సమావేశంలో ఆమోదం తెలిపింది. తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని వ్యయాన్ని విభజించింది. పీపీఏ సిఫార్సు తర్వాత దానికి పెట్టుబడుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి.. సాగునీటి విభాగం మిగిలిన భాగం నిర్మాణానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే నూరు శాతం సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును బిల్లులు అందగానే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సుల ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నాం. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకూ రూ.11,600.16 కోట్లు చెల్లించాం. తర్వాత పీపీఏ, సీడబ్ల్యూసీలు రూ.711.60 కోట్ల చెల్లింపునకు సిఫార్సు చేశాయి’ అని బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.

నిర్మాణంపై వీటన్నింటి ప్రభావం

విభిన్న కారణాలు పోలవరం నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపినట్లు భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ సమాధానమిచ్చారు. కొవిడ్‌ మహమ్మారి, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు చెందిన గ్యాప్‌-1, గ్యాప్‌-2ల్లో లోతుగా కోతపడటం (డీప్‌ స్కారింగ్‌) సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడంలో జాప్యం వంటివి నిర్మాణంపై ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును నిపుణులు, నైపుణ్య సంస్థలు క్రమం తప్పకుండా సందర్శిస్తున్నట్లు తెలిపారు.

వివిధ దశల్లో పనులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యాం, కాంక్రీట్‌ డ్యాం (గ్యాప్‌-3), డయాఫ్రం వాల్‌కు చెందిన ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌డ్యాం (గ్యాప్‌-1) నిర్మాణం పూర్తయినట్లు బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. మిగిలిన ప్రధాన విభాగాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. అందులో స్పిల్‌వే రేడియల్‌ గేట్లు 88%, స్పిల్‌ ఛానల్‌ 88%, అప్రోచ్‌ ఛానల్‌ ఎర్త్‌ వర్క్‌ 73%, పైలట్‌ ఛానల్‌ వర్క్‌ 34%, పవర్‌ హౌస్‌ ఫౌండేషన్‌ ఎక్సవేషన్‌ 97% పురోగతి సాధించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని నెలవారీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపుతోందన్నారు. దాని ప్రకారం 2019 జనవరి నుంచి 2021 నవంబర్‌ వరకు పనుల పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు.

పోలవరం నిధుల అంచనాలు- మంజూరు, కోత క్రమం ఇలా..

* 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.16010.45 కోట్లుగా లెక్క తేల్చారు. అప్పట్లో సాంకేతిక కమిటీ ఆమోదం ప్రకారమే అవే నిధులిస్తూ వస్తున్నారు.

* ఆ తర్వాత 2013-14 అంచనా ధరలతోనూ, 2017-18 అంచనా ధరలతోనూ పోలవరం ప్రాజెక్టుకు ఎంత మొత్తం వ్యయమవుతుందో లెక్కించారు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనను సాంకేతిక సలహా కమిటీ దాదాపు ఆమోదించినా అంచనాల సవరణ కమిటీ (ఆర్‌సీసీ) భారీగా కోత పెట్టింది.

* 2013-14 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.29,075 కోట్లకు ఆమోదించింది. అందులో తాగునీటి విభాగం కింద రూ.4,068.43 కోట్లు, విద్యుత్కేంద్రం కోసం రూ.4,560.91 కోట్లు మినహాయించి రూ.20,398.61 కోట్లు ఇవ్వాల్సిన మొత్తంగా తేల్చింది. దీనిలో అప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయించి ఇక రూ.7,053 కోట్లే ఇస్తామని నిరుడు అక్టోబరులో తేల్చిచెప్పింది. పైగా ప్రధాన డ్యాం నిర్మాణం, కుడి కాలువ, ఎడమ కాలువ, పునరావాసం, భూసేకరణ విభాగానికి ఆ అంచనాల్లో ఎంత మొత్తం ఆమోదించామో అంతకుమించి నిధులు ఇవ్వబోమని చెబుతోంది. ప్రస్తుతం ఈ లెక్కల ప్రకారమే నిధులు వస్తున్నాయి. దీంతో రూ.కోట్ల బిల్లులు పీపీఏ నుంచి వెనక్కి వస్తున్నాయి.

* 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అంతవరకు విభాగాల వారీ నిబంధనలు, తాగునీటి విభాగం నిధుల కోత మినహాయించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో 2017-18 ధరల ప్రకారం సాగునీటి విభాగం కింద రూ.35,950.16 కోట్లకు కేంద్రం పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉందని కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని