Paddy: బోర్ల కింద వరి వద్దు

బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి.

Updated : 07 Dec 2021 05:42 IST

 ప్రత్యామ్నాయ పంటలేయించండి

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలివ్వండి: సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరుధాన్యాల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వాటిని అధికంగా పండించే ప్రాంతాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలని సూచించారు. ‘ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం) యూనిట్‌గా.. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వాటిలో ఏర్పాటు చేసే అద్దె యంత్ర కేంద్రాల్లో సేంద్రియ సాగుకు పనికొచ్చే పరికరాలు ఉంచాలి’ అని పేర్కొన్నారు.

కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్ల జైలు

‘రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయాలి. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీకేలను నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడమే కాకుండా.. చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్గానిక్‌ పాల మార్కెటింగ్‌పై దృష్టి పెట్టి, రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పశువులకు సేంద్రియ దాణా అందుబాటులో ఉంచాలని, ఆర్గానిక్‌ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం జిల్లాకో యూనిట్‌ ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో 45.35 లక్షల మంది రైతులకు చెందిన 1.12 కోట్ల ఎకరాలను ఈ-క్రాప్‌ చేశామని, రబీలోనూ ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్పారు.

కృష్ణా, అనంతపురంలో పాలవెల్లువ

కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రోజువారీ పాల సేకరణ గతేడాది నవంబరులో 2,812 లీటర్లు ఉంటే.. ఈ ఏడాది నవంబరులో 71,911 లీటర్లకు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.32 కోట్ల లీటర్ల పాలను సేకరించామని చెప్పారు. సమావేశంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ నాగిరెడ్డి, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని