Updated : 06/10/2021 06:31 IST

girls dropouts:విద్యార్థినులు పాఠశాలలకు దూరం కావొద్దు

ఏటా 10 లక్షల మందికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ
చేయూత దుకాణాల్లో తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి..
‘స్వేచ్ఛ’ ప్రారంభోత్సవంలో సీఎం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్ల అందించనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. పీఅండ్‌జీ, హైజీన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌, నైన్‌ కంపెనీకి చెందిన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లను ప్రతి విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 ఇస్తామని తెలిపారు. వేసవి సెలవులకు సరిపడా సెలవులకంటే ముందే ఒకేసారి పాఠశాలల్లోనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఏడాదికి రూ.32 కోట్లు వ్యయమవుతుందన్నారు. గ్రామస్థాయిలోని మహిళలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే చేయూత దుకాణాల్లోనూ విక్రయిస్తామని చెప్పారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వేచ్ఛ పోస్టరును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. దేశంలో దాదాపు 23% మంది విద్యార్థినులు పాఠశాల మానేయడానికి రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే కారణమని యునైటెడ్‌ వాటర్‌సప్లై అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. రుతుక్రమానికి సంబంధించిన అంశాలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే ఆలోచన మారాలి’ అని సూచించారు.

నెలకోసారి అవగాహన సదస్సు

‘బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయురాలు, అధ్యాపకురాలు, ఏఎన్‌ఎంలు 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు నెలకోసారి తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి. మహిళా పోలీసు ఇందులో భాగస్వామ్యం కావాలి. దిశ చట్టంపై, యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే అంశాలపై మహిళా పోలీసు అవగాహన కల్పించాలి. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లాల్లో జేసీ (ఆసరా) పర్యవేక్షించాలి’ అని సీఎం ఆదేశించారు. ‘ఈ పథకం అమలుకు ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్‌ అధికారిగా ఒక ఉపాధ్యాయురాలు/అధ్యాపకురాలిని నియమిస్తాం. పాఠశాల, కళాశాల స్థాయిలో అమలు బాధ్యతను నోడల్‌ అధికారి పర్యవేక్షిస్తారు. వినియోగించిన శానిటరీ న్యాప్‌కిన్స్‌ పర్యావరణానికి నష్టం కల్గించకుండా ఎలా పారేయాలనే (డిస్పోజ్‌) అంశంపై విద్యార్థినులకు ఆ నోడల్‌ అధికారి అవగాహన కల్పించాలి. శానిటరీ న్యాప్‌కిన్స్‌ను డిస్పోజ్‌ చేసి పర్యావరణ హానిరహితంగా మార్చేందుకు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటుచేశాం. పాఠశాలల్లోని మరుగుదొడ్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తున్నాం. పురపాలక సంఘాలకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్లను ఇస్తాం’ అని తెలిపారు.

మహిళా సాధికారతలో మనమే ముందు

‘మహిళా సాధికారతలో 28 రాష్ట్రాలకంటే మనమే ముందున్నాం. అమ్మఒడి, సంపూర్ణ పోషణ, ఆసరా, సున్నావడ్డీ రుణాలు, చేయూత, ఇళ్ల పట్టాలు.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా మహిళల కేంద్రంగానే అమలు చేస్తున్నాం’ అని జగన్‌ వివరించారు. అక్టోబరు, నవంబరు నెలలకు సరిపడా నిల్వలను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు.


శానిటరీ న్యాప్‌కిన్‌ పంపిణీకి ఆదేశాలు

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్‌లను ఈనెల 8లోపు విద్యార్థులకు అందించాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు, అక్టోబరు నెలకు సంబంధించి ఆగస్టు నెలలో అందించిన వాటిని పంపిణీ చేయాలని పేర్కొంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని