
Metro Brands Q3 Results: మెట్రో బ్రాండ్స్ లాభాల్లో 54.63% వృద్ధి
దిల్లీ: ఇటీవలే స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన ఫుట్‌వేర్ రిటైల్ చైన్ మెట్రో బ్రాండ్స్ మూడో త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కంపెనీ నికర లాభాలు రూ.100.85 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో వచ్చిన రూ.65.22 కోట్లతో పోలిస్తే 54.63 శాతం వృద్ధి కనబడింది. కార్యకలాపాల ద్వారా వస్తున్న ఆదాయం 59.02 శాతం పెరిగి రూ.483.77 కోట్లుగా నమోదయ్యాయి. సంస్థ వ్యయాలు సైతం 47.26 శాతం పెరిగి రూ.362.59 కోట్లకు చేరాయి. గతేడాది వ్యయాలు రూ.246.21 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ చరిత్రలో ప్యాట్ (PAT), ఎబిట్‌డా (EBITDA) పరంగా అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు ఇవేనని సంస్థ సీఈవో నిస్సాన్ జోసెఫ్ తెలిపారు. ఈ-కామర్స్, ఓమ్నీఛానెల్‌తో పాటు వివిధ పట్టణాల్లోని తమ ఔట్‌లెట్ల కార్యకలాపాల్లో గణనీయ వృద్ధి కనిపించిందని వెల్లడించారు.
డిసెంబరులో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన మెట్రో బ్రాండ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.295 కోట్లు సమీకరించింది. అలాగే, మరో ఫుట్‌వేర్ బ్రాండ్ ఫిట్‌ఫ్లాప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మెట్రోబ్రాండ్స్ తెలిపింది.