Budget 2022: ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు పెంచాలి.. ఫార్మా ఇండస్ట్రీ వినతులివే!

మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలోని డొల్లతనాన్ని కొవిడ్‌ మహమ్మారి భయటపెట్టింది. ముఖ్యంగా రెండో వేవ్‌ సమయంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత, ఐసీయూ పడకల కొరత ఈ రంగంలోని మౌలిక సదుపాయాల మెరుగు పడాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది.

Published : 23 Jan 2022 18:24 IST

దిల్లీ: మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలోని డొల్లతనాన్ని కొవిడ్‌ మహమ్మారి భయటపెట్టింది. ముఖ్యంగా రెండో వేవ్‌ సమయంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత, ఐసీయూ పడకల కొరత ఈ రంగంలోని మౌలిక సదుపాయాల మెరుగు పడాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. గతేడాది బడ్జెట్‌లో వ్యాక్సిన్లకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపినప్పటికీ.. మొత్తంగా ఆరోగ్య రంగానికి పెంచింది అంతంత మాత్రమే. ఈ సారైనా జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఫార్మా ఇండస్ట్రీ కోరుతోంది. అలాగే పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి, పలు ఔషధాలపై రాయితీని కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఫార్మా రంగం కేంద్రం ముందు పలు వినతులు ఉంచింది. అవేంటంటే...

ఆరోగ్య రంగానికి ప్రస్తుతం బడ్జెట్‌లో జీడీపీలో 1.8 శాతం మాత్రమే కేటాయింపులు జరుపుతున్నారని, ఆ మొత్తాన్ని 2.5- 3 శాతానికైనా పెంచాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓపీపీఐ) ప్రెసిడెంట్‌ ఎస్‌ శ్రీధర్‌ కేంద్రాన్ని కోరారు. బయో ఫార్మాస్యూటికల్స్‌ ఆర్‌అండ్‌డీ విభాగానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ఔషధాలపై ఇప్పుడిస్తున్న కస్టమ్స్‌ డ్యూటీ రాయితీని కొనసాగించాలని, కొన్ని అరుదైన వ్యాధులను నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఔషధాలకు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పుడే సామాన్యులకు సైతం తక్కువ ధరకే ఔషధాలు లభిస్తాయన్నారు. 

ఫార్మా రంగంలో సులభతర వాణిజ్య విధానాలను అవలంబించాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అలియన్స్‌ సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడే రోగుల అవసరాలను తీర్చే స్థాయిలో భారత ఫార్మా రంగం సన్నద్ధం కాగలదని చెప్పారు. టెలిమెడిసన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను వృద్ధి చేయాల్సిన అవసరాన్ని కొవిడ్‌ మహమ్మారి తెలియజెప్పిందని హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీకి చెందిన నెట్‌హెల్త్‌ అభిప్రాయపడింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు కలిగిన ఆస్పత్రులు నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడిందని ఆ సంఘం ప్రెసిడెంట్‌ హర్ష్‌ మహాజన్‌ తెలిపారు. అందుకు కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులు జరపాల్సి ఉంటుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని