Stock market: ఆరంభంలోనే ఎరుపెక్కిన మార్కెట్లు..!

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి....

Updated : 21 Jan 2022 09:47 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 564 పాయింట్ల నష్టంతో 58,899 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయి 17,586 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.51 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్ మహీంద్రా, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

ఒమిక్రాన్‌ (Omicron) నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగం మూడు నెలల గరిష్ఠానికి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ సూచీలు దిద్దుబాటుకు గురువుతున్న సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. దీనికి తోడు చమురు ధరలు (Oil Prices) పెరగడంతో ద్రవ్యోల్బణ (Infaltion) భయాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇక ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం కూడా సూచీలను ప్రభావితం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టిసారించారు. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపడానికి బాల్టిక్‌ దేశాలకు అగ్రరాజ్యం అనుమతినివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశీయంగా చూస్తే విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు గురువారం కూడా కొనసాగాయి. ఈ పరిణామాలే సూచీల నష్టాలకు కారణమవుతున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* హెచ్‌యూఎల్‌: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరులో రూ.2,300 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.1,938 కోట్లతో పోలిస్తే ఇది 18.68 శాతం అధికం. ఇదే సమయంలో విక్రయాల ఆదాయం రూ.11,969 కోట్ల నుంచి 10.25 శాతం పెరిగి రూ.13,196 కోట్లుగా నమోదైంది.

* సైయెంట్‌ లిమిటెడ్‌: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. మొత్తం రూ.1,183.4 కోట్ల ఆదాయంపై రూ.131.7 కోట్ల నికరలాభం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 13.3%, లాభం 38% పెరిగాయి. ఎబిటా (వడ్డీ, తరుగుదల, పన్ను, ఇతర కేటాయింపుల కంటే ముందు లాభం) మిగులు 13.9% ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. 

* హెచ్‌సీఎల్‌ టెక్‌: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీపై దివాలా చర్యలు ఆరంభించాలన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఈనెల 17న ఇచ్చిన ఆదేశాలపై జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్టే మంజూరు చేసింది.

* పీటీసీ ఇండియా: ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు తమ రాజీనామా లేఖల్లో లేవనెత్తిన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఆందోళనలను కంపెనీ ధ్రువీకరించింది. కొన్ని సమస్యలు ఉన్నట్లు అంగీకరించింది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 

* ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌‌: గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీ నుంచి పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసుల నిర్వహణకు ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ అనుమతినిచ్చింది. 

* సూర్య రోష్ని: ఓఎన్‌జీసీ, ఎంఎస్‌ కంపెనీల నుంచి సంస్థకు రూ.123.17 కోట్లు విలువ చేసే ఆర్డర్లు లభించాయి.   

* అల్ట్రాటెక్‌‌‌: నేషనల్‌ లైమ్‌స్టోన్‌ కంపెనీలో 100 శాతం ఈక్విటీలను సొంతం చేసుకునే షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ను అమలు చేసింది. 

* ఈరోజు త్రైమాసిక ఫలితాలు వెల్లడించబోయే కంపెనీలు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిందూస్థాన్‌ జింక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్‌, గ్లాండ్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌, వొడాఫోన్‌ ఐడియా, పీఎన్‌బీ గిల్ట్స్‌, పాలీక్యాబ్‌ ఇండియా, తన్లా ప్లాట్‌ఫామ్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌, కజారియా సిరమిక్స్‌, జ్యోతి ల్యాబ్స్, హెరిటేజ్‌ ఫుడ్స్‌, రతన్‌ఇండియా పవర్‌, సుప్రియా లైఫ్‌సైన్సెస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు