
Safari Dark edition: సఫారీలోనూ డార్క్ ఎడిషన్.. ధర ఎంతంటే?
దిల్లీ: ప్రీమియం ఎస్యూవీ అయిన సఫారీలో డార్క్ ఎడిషన్‌ను టాటా మోటార్స్ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.19.05 లక్షలు (ఎక్స్‌షోరూం). బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో ఈ వాహనం అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
ఎక్స్‌టీ+, ఎక్స్‌టీఏ+, ఎక్స్జెడ్+, ఎక్స్జెడ్ఏ+ ట్రిమ్‌లలో డార్క్ ఎడిషన్ సఫారీ అందుబాటులో ఉంది. దీంట్లో ప్రత్యేకంగా రెండు వరుసల్లోని సీట్లకు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫయర్లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కూడా డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేకం. డార్క్ ఎడిషన్‌కు ఆదరణ పెరుగుతోందని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ ఉపాధ్యక్షుడు రాజన్ అంబా తెలిపారు. తొలుత పరిమిత ఎడిషన్ కింద తీసుకొచ్చిన ఈ మోడళ్లు తర్వాత తమ ప్రధాన వాహన శ్రేణిలో జత చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. హ్యారియర్ డార్క్ అలా తీసుకొచ్చిందేనని తెలిపారు. కానీ, తర్వాత కస్టమర్ల డిమాండ్ మేరకు హ్యారియర్ పోర్ట్‌ఫోలియోలో డార్క్ ఎడిషన్‌ను చేర్చాల్సి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 16,000 సఫారీ ఎస్‌యూవీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.