Electronics:300 బిలియన్‌ డాలర్లకు దేశీయ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ..ఎప్పటికంటే?

దేశ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ 2026 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ‘ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA)’ అంచనా వేసింది....

Published : 24 Jan 2022 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ విలువ 2026 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ‘ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA)’ అంచనా వేసింది. ‘నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎలక్ట్రానిక్స్‌ (NPE) 2019 ప్రకారం.. 2025 నాటికి పరిశ్రమ 400 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని గుర్తుచేసింది. అయితే, అది సాధ్యం కాకపోవచ్చునని తెలిపింది. కొవిడ్‌-19 వల్ల తలెత్తిన దుష్పరిణామాలే అందుకు కారణమని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీఈ లక్ష్యాన్ని 300 బిలియన్‌ డాలర్లకు సవరించడం సమంజసంగా ఉంటుందని ఐసీఈఏ నివేదిక పేర్కొంది.

అయితే, 300 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ప్రస్తుతం ఉన్న తయారీ విలువలో 400 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రభుత్వం పన్ను టారిఫ్‌లపై ఎలాంటి మార్పులు చేయొద్దని కోరారు. ఈ రంగంలో రాణిస్తున్న దేశీయ కంపెనీలను సర్కార్‌ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 నాటికి దేశంలో 180 బిలియన్ డాలర్లు విలువ చేసే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందని అంచనా వేశారు. నిర్దేశిత లక్ష్యమైన 300 బిలియన్‌ డాలర్లను అందుకుంటే దేశీయ అవసరాలకు ఎలాంటి కొరత ఉండదన్నారు. మిగిలిన 120 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతికి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని