భారత్‌ భేష్‌

కొవిడ్‌ పరిణామాల ప్రభావం ఉన్నా, అంతర్జాతీయ ఇబ్బందులున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 12 నెలల్లో పుంజుకుంటుందని పీడబ్ల్యూసీ వార్షిక అంతర్జాతీయ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారుల) సర్వే వెల్లడించింది. 89 దేశాలు, ప్రాంతాల్లోని 4,446 మంది కార్పొరేట్‌ కంపెనీల

Published : 18 Jan 2022 02:19 IST

12 నెలల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
పీడబ్ల్యూసీ వార్షిక అంతర్జాతీయ సీఈఓ సర్వే

దిల్లీ: కొవిడ్‌ పరిణామాల ప్రభావం ఉన్నా, అంతర్జాతీయ ఇబ్బందులున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 12 నెలల్లో పుంజుకుంటుందని పీడబ్ల్యూసీ వార్షిక అంతర్జాతీయ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారుల) సర్వే వెల్లడించింది. 89 దేశాలు, ప్రాంతాల్లోని 4,446 మంది కార్పొరేట్‌ కంపెనీల సీఈఓల నుంచి 2021 అక్టోబరు-నవంబరు మధ్యలో అభిప్రాయాలు సమీకరించిన  అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ, ఆ వివరాలతో నివేదికను సోమవారం వెల్లడించింది. ఇందులో భారత్‌ నుంచి 77 మంది సీఈఓలు పాల్గొన్నారు. సర్వే నివేదికలోని ముఖ్యాంశాలు..  

* రాబోయే సంవత్సర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భారత్‌ నుంచి అభిప్రాయాలు తెలిపిన సీఈఓ ల్లో 99 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపైనా ఆశావహంగా ఉన్నామని 94% మంది భారతీయ సీఈఓలు వెల్లడించారు. అంతర్జాతీయ సీఈఓల్లో 77% మందే అంతర్జాతీయ వృద్ధిపై సానుకూలంగా ఉన్నారు.

* తమ కంపెనీల ఆదాయం వృద్ధి చెందుతుందనే 98 శాతం మంది సీఈఓలు పేర్కొన్నారు.

* గత ఏడాదితో పోలిస్తే ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ సీఈఓలు ఆశావాదంతో ఉన్నారు. భారత్‌లో గత ఏడాది 88 శాతం మంది సీఈఓలు సానుకూలంగా ఉండగా, ఈ ఏడాది అది 94 శాతానికి చేరింది.

* స్వల్ప కాలానికే కాకుండా వచ్చే మూడేళ్లలోనూ కంపెనీల ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని 97% మంది భారతీయ సీఈఓలు వెల్లడించారు.

* 2021లో 70 శాతం మంది భారతీయ సీఈఓలు ‘వృద్ధికి కొవిడ్‌ విఘాతం కలిగిస్తుంద’ని పేర్కొన్నారు. 62% మంది సైబర్‌ దాడులు వృద్ధికి ప్రతిబంధకంగా మారతాయని పేర్కొన్నారు.  

* ఆదాయంపైనా సైబర్‌ దాడుల ప్రభావం ఉంటుందని, తమ ఉత్పత్తులు, సేవల విక్రయాలపై ప్రభావం చూపుతాయని 64 శాతం మంది సీఈఓలు పేర్కొన్నారు. తమ ఉత్పత్తులు, సేవలు అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కూడా సైబర్‌ దాడులు ప్రభావితం చేస్తాయని 47 శాతం మంది సీఈఓలు అంచనా వేశారు.

* శూన్య ఉద్గారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని 27% మంది భారతీయ సీఈఓలు చెప్పారు. అంతర్జాతీయంగా ఇది 22 శాతమే.  

ఒమిక్రాన్‌ నుంచి రక్షిస్తూ..: ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ సీఈఓలు తమ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్మన్‌ సంజీవ్‌ కృష్ణన్‌ తెలిపారు. కొవిడ్‌ పరిణామాలు సృష్టించిన అవరోధాల నుంచి బయటపడేలా, మరింత వృద్ధి సాధించేలా కార్యాచరణలో ఉన్నారని పేర్కొన్నారు.


2022 చివరికి మరో 50 యూనికార్న్‌లు

ఏడాది చివరికి మరో 50 అంకుర సంస్థలు యూనికార్న్‌ (బిలియన్‌ డాలర్ల/ రూ.7500 కోట్ల విలువైన సంస్థ) హోదా సాధిస్తాయని, వీటితో కలిపి మొత్తం యూనికార్న్‌ల సంఖ్య కనీసం 100కు చేరుతుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక పేర్కొంది. 2021లో నమోదిత, నమోదు కాని సంస్థల విలువలు భారీగా పెరిగాయని.. స్టాక్‌ మార్కెట్‌ దూకుడు, సరిపడా నగదు లభ్యత ఇందుకు తోడ్పడ్డాయని వెల్లడించింది. ఒక్క అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలోనే భారత అంకుర వ్యవస్థలోకి 10 బి.డాలర్లు (దాదాపు రూ.75,000 కోట్లు)కు పైగా పెట్టుబడులు వచ్చాయని పీడబ్ల్యూసీ తెలిపింది. 2021లో 1000కు పైగా దఫాల్లో భారత అంకురాలు 35 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 2,62,500 కోట్లు) సమీకరించాయి. యూనికార్న్‌గా మారే సత్తా ఉన్న 50 కంపెనీల జాబితాలో ఖాతాబుక్‌, వాట్‌ఫిక్స్‌, ప్రాక్టో, నింజాకార్ట్‌, ఇన్‌షార్ట్స్‌, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌, పెప్పర్‌ఫ్రై, లివ్‌స్పేస్‌ వంటి సంస్థలు  ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని