హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,300 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరులో రూ.2,300 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల  లాభం రూ.1,938 కోట్లతో పోలిస్తే ఇది 18.68 శాతం

Published : 21 Jan 2022 05:34 IST

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరులో రూ.2,300 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల  లాభం రూ.1,938 కోట్లతో పోలిస్తే ఇది 18.68 శాతం అధికం. ఇదే సమయంలో విక్రయాల ఆదాయం రూ.11,969 కోట్ల నుంచి 10.25 శాతం పెరిగి రూ.13,196 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ.9,548 కోట్ల నుంచి రూ.10,329 కోట్లకు పెరిగాయి. ‘మా వ్యాపార మూలాలు చాలా బలంగా ఉన్నాయి. అన్ని విభాగాలతో పాటు గ్రామీణ, పట్టణ విపణుల్లో మార్కెట్‌ వాటా పెంచుకున్నాం. ముడిపదార్థాల ధరలు పెరిగినా సమీక్షా త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనబరిచామ’ని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా వెల్లడించారు. స్వల్పకాలానికి నిర్వహణ వాతావరణం  సవాళ్లతో కూడుకుని ఉన్నా, మధ్య- దీర్ఘకాలానికి చాలా నమ్మకంతో ఉన్నామని సంజీవ్‌ తెలిపారు. స్థిరంగా, పోటీని తట్టుకుంటూ లాభదాయకత పెంచుకుంటామన్నారు. సమీక్షా త్రైమాసికంలో హెచ్‌యూఎల్‌ ఎబిటా మార్జిన్‌ 100 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగి 25.4 శాతానికి చేరింది.

విభాగాల వారీగా ఆదాయాలు గమనిస్తే..

* గృహ సంరక్షణ విభాగాదాయం రూ.3,409 కోట్ల నుంచి 22.97 శాతం వృద్ధి చెంది రూ.4,192 కోట్లకు చేరింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగాదాయం రూ.4,868 కోట్ల నుంచి 7.08 శాతం పెరిగి రూ.5,213 కోట్లకు చేరింది. ఆహార, ఉపాహార ఉత్పత్తుల విభాగాదాయం రూ.3,356 కోట్ల నుంచి 3.27 శాతం పెరిగి రూ.3,466 కోట్లకు చేరింది. ఎగుమతులతో కలిపి ఇతర విభాగాల ఆదాయం రూ.548 కోట్ల నుంచి 3.65 శాతం వృద్ధి చెంది రూ.568 కోట్లకు చేరింది.

* బీఎస్‌ఈలో షేరు 2.13 శాతం తగ్గి రూ.2,261.60 వద్ద ముగిసింది.


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లాభం రూ.325 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) డిసెంబరు త్రైమాసికంలో రూ.325 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదేకాల లాభం రూ.154 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.3,582 కోట్ల నుంచి రూ.3,893 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.1,306 కోట్ల నుంచి 17 శాతం వృద్ధి చెంది రూ.1,527 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.06 శాతం నుంచి 3.11 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 7.69 శాతం (రూ.8,072.43 కోట్లు) నుంచి 4.73 శాతానికి (రూ.6,104.65 కోట్లు) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 2.59 శాతం (రూ.2,579 కోట్లు) నుంచి 1.24 శాతానికి (రూ.1,545 కోట్లు) పరిమితమయ్యాయి. మొత్తం కేటాయింపులు రూ.753 కోట్ల నుంచి రూ.838 కోట్లకు చేరగా, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.386 కోట్ల నుంచి రూ.587 కోట్లకు పెరిగాయి. కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 89.55 శాతం నుంచి 93.77 శాతానికి చేరింది. కనీస మూలధన నిష్పత్తి 13.65 శాతం నుంచి 14.85 శాతానికి పెరిగింది.

* స్థూల రుణాలు 22.98 శాతం పెరిగి రూ.1,29,006 కోట్లకు, మొత్తం డిపాజిట్లు 15.21 శాతం పెరిగి రూ.1,86,614 కోట్లకు చేరాయి. కొవిడ్‌ పరిణామాల వల్ల రుణ పునర్నిర్మాణం రూ.5,600 కోట్ల మేర జరిగింది.

* ‘సమీక్షా త్రైమాసికంలో ఎన్నడూ నమోదు చేయని రీతిలో అత్యధిక త్రైమాసిక లాభం ప్రకటించడానికి నికర వడ్డీ ఆదాయం పెరగడం దోహదం చేసింది. ప్రాధాన్య రంగ రుణ సర్టిఫికెట్లను  విక్రయించడం ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 17-20 శాతం రుణ వృద్ధి, 10-12 శాతం డిపాజిట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామ’ని బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఏఎస్‌ రాజీవ్‌ వెల్లడించారు.

* బీఎస్‌ఈలో షేరు 2.33 శాతం నష్టంతో రూ.21 వద్ద ముగిసింది.


19% తగ్గిన ఏషియన్‌ పెయింట్స్‌ లాభం

దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో ఏషియన్‌ పెయింట్స్‌ రూ.1,031.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదేకాల లాభం రూ.1,265.35 కోట్లతో పోలిస్తే ఇది  18.5 శాతం తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.6,788.47 కోట్ల నుంచి   25.61 శాతం పెరిగి  రూ.8,527.24 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.5,214.88 కోట్ల నుంచి 38.46 శాతం పెరిగి రూ.7,220.29 కోట్లకు చేరాయి. పెయింట్స్‌ విభాగాదాయం 25.39 శాతం పెరిగి రూ.8,319.42 కోట్లకు, హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ విభాగాదాయం 36.42 శాతం పెరిగి రూ.209.26 కోట్లకు చేరాయి. ‘ముడి పదార్థాల ధరలు అధికమై, సమీక్షా త్రైమాసికంలో స్థూల మార్జిన్‌పై ప్రభావం పడింది. అందుకే నవంబరు, డిసెంబరులో ధరలు పెంచాల్సి వచ్చింద’ని ఏషియన్‌ పెయింట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అమిత్‌ సింగ్లే వెల్లడించారు.


స్వల్పంగా తగ్గిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభం

ముంబయి: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.1,256 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదేకాల లాభం రూ.1,290 కోట్లతో పోలిస్తే ఈసారి 2.63 శాతం తగ్గింది. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం రూ.15,961 కోట్ల నుంచి రూ.17,620 కోట్లకు పెరిగింది.

*  బజాజ్‌ పైనాన్స్‌ ఏకీకృత నికర లాభం రూ.1,146 కోట్ల 85 శాతం వృద్ధితో రూ.2,125 కోట్లకు చేరింది. ఆస్తుల నిర్వహణ వ్యాపారంలో గణనీయ వృద్ధి, అధిక వడ్డీ ఆదాయం లాంటివి లాభంలో వృద్ధికి దోహదం చేశాయి. ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) విభాగ ఆదాయం రూ.1,43,550 కోట్ల నుంచి 26 శాతం అధికమై రూ.1,81,250 కోట్లకు చేరింది.

* బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం రూ.330 కోట్ల నుంచి తగ్గి రూ.304 కోట్లకు పరిమితమైంది. స్థూల ప్రీమియం రూ.3,392 కోట్ల నుంచి రూ.2,959 కోట్లకు తగ్గింది. క్లెయిమ్‌ల నిష్పత్తి 66.6 శాతం నుంచి 69.6 శాతానికి పెరిగింది.

* బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కొత్త వ్యాపార ప్రీమియం రూ.1,706 కోట్ల నుంచి రూ.2,377 కోట్లకు చేరింది. రెన్యూవల్‌ ప్రీమియం రూ.1,441 కోట్ల నుంచి రూ.1,702 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని