ఫలితాలు, ఫెడ్‌ సమావేశం కీలకం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల మధ్య కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు త్రైమాసిక ఫలితాలు, అమెరికా బాండు రాబడుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన  సమావేశాలపై మదుపర్లు దృష్టిపెట్టనున్నారు.

Published : 24 Jan 2022 02:16 IST
ఒడుదొడుకులు పెరిగే అవకాశం
బ్యాంకు, ఐటీ షేర్లకు సానుకూలతలు
బుధవారం గణతంత్ర దినోత్సవం సెలవు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల మధ్య కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు త్రైమాసిక ఫలితాలు, అమెరికా బాండు రాబడుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన  సమావేశాలపై మదుపర్లు దృష్టిపెట్టనున్నారు. వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు తీసుకోవచ్చు. గత వారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల ప్రభావం నేడు ఉండనుంది. నిఫ్టీ 17500 స్థాయి నిలబెట్టుకుంటే.. 18000 పాయింట్ల వరకు పుంజుకోవచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 37,200 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌    ఫలితాలు ప్రకటించనుండటంతో ఈ వారం బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీల షేర్లు వెలుగులోకి రావొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు షేర్లు ఒడుదొడుకుల మధ్య కదలాడవచ్చు. మధ్య నుంచి దీర్ఘకాల వ్యవధిలో ఈ రంగంపై నిపుణులు సానుకూలంగా ఉన్నారు. అయితే ఖర్చులు, ధరల ప్రభావం వంటి ఇబ్బందులు ఉన్నాయి.

* రిలయన్స్‌, వొడాఫోన్‌ ఐడియా ఫలితాల నుంచి టెలికాం షేర్లు సంకేతాలు తీసుకోవచ్చు. టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ఈ కంపెనీల వినియోగదారు సగటు ఆదాయం (ఆర్పు)పై దృష్టి పెట్టొచ్చు.

* మార్కెట్‌కు అనుగుణంగా యంత్రపరికరాల షేర్లు కదలాడొచ్చు. కంపెనీలు ఆర్డర్లు దక్కించుకోవడంతో పాటు రాబోయే బడ్జెట్‌లో ప్రకటనలు ఈ రంగ షేర్లకు కీలకం కానున్నాయి.

* అంతర్జాతీయ ప్రాథమిక లోహ ధరలు, డిసెంబరు త్రైమాసిక ఫలితాల నుంచి లోహ, గనుల కంపెనీల షేర్లు సంకేతాలు తీసుకోవచ్చు. ఈ వారం వేదాంతా ఫలితాలు ప్రకటించనుంది.

* ఔషధ షేర్లు స్తబ్దుగా చలించొచ్చు. బడ్జెట్‌ సమీపిస్తున్న తరుణంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించొచ్చు. సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఫలితాలపై కన్నేయొచ్చు. కంపెనీల లాభాలపై ముడివస్తువుల ధరల ప్రభావం కనిపిస్తోంది.

* ఇటీవలి లాభాల స్వీకరణ నుంచి ఐటీ షేర్లు పుంజుకునే అవకాశం ఉంది. జెన్సార్‌, కోఫోర్జ్‌, బిర్లాసాఫ్ట్‌, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ త్రైమాసిక ఫలితాలు వెలువరించనున్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ గత వారం 7.1 శాతం నష్టపోయింది.

* వాహన కంపెనీల షేర్లు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. మారుతీ సుజుకీ ఫలితాలు కీలకం కానున్నాయి. సెమీకండక్టర్ల కొరత కారణంగా అమ్మకాలు తగ్గడంతో కంపెనీ లాభం తగ్గే అవకాశం ఉంది.

* బ్యాంకింగ్‌లో షేరు ఆధారిత కదలికలు కొనసాగవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ ఫలితాలు ఈ రంగ షేర్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. రోలోవర్ల నేపథ్యంలో ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది.

* అంతర్లీనంగా ప్రతికూల ధోరణితో చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. కీలక సూచీల నుంచే ఇవి సంకేతాలు అందుకోవచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు కదలాడొచ్చు.

* మార్కెట్‌ కదలికల ఆధారంగా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు ట్రేడయ్యే అవకాశం ఉంది. బడ్జెట్‌, ఫెడ్‌ సమావేశాలు అప్రమత్తతకు దారితీయొచ్చు. కోల్గేట్‌, మారికో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు