డెకా కార్న్‌.. స్విగ్గీ

దేశంలో మరో డెకా కార్న్‌ (10 బిలియన్‌ డాలర్లు/సుమారు రూ.75000 కోట్ల విలువైన) సంస్థగా ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు దేశీయ అంకురాల్లో పేటీఎం, ఓయో, బైజూస్‌ ఈ ఘనత సాధించాయి. 1 బిలియన్‌ డాలర్‌

Published : 25 Jan 2022 02:57 IST

కంపెనీ విలువ రూ.80,000 కోట్లకు
6 నెలల్లోనే దాదాపు రెట్టింపు స్థాయికి
తాజాగా రూ.5,225 కోట్ల సమీకరణ

దిల్లీ: దేశంలో మరో డెకా కార్న్‌ (10 బిలియన్‌ డాలర్లు/సుమారు రూ.75000 కోట్ల విలువైన) సంస్థగా ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు దేశీయ అంకురాల్లో పేటీఎం, ఓయో, బైజూస్‌ ఈ ఘనత సాధించాయి. 1 బిలియన్‌ డాలర్‌ (100 కోట్ల డాలర్లు/సుమారు  రూ.7500 కోట్ల విలువ కలిగిన సంస్థను యూనికార్న్‌గా వ్యవహరిస్తుండగా, అంతకు పది రెట్ల విలువ కలిగిన సంస్థను డెకాకార్న్‌గా పేర్కొంటారు.

పెట్టుబడి సంస్థ ఇన్వెస్కో, ఇతర సంస్థల నుంచి 700 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,225 కోట్లు) సమీకరించినట్లు ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ సోమవారం ప్రకటించింది. కీలక వ్యాపార వృద్ధితో పాటు క్విక్‌ కామర్స్‌ గ్రోసరీ సేవల విభాగమైన ‘ఇన్‌స్టామార్ట్‌’ విస్తరణకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపింది. తాజా దఫా నిధుల సమీకరణ రౌండ్‌లో కంపెనీ విలువను 10.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.80000 కోట్లు)గా లెక్కకట్టారు. 2021 జులైలో 125 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ సమయంలో, కంపెనీ విలువను   5.5 బి.డాలర్లుగా పరిగణించారు. అంటే 6 నెలల్లోనే సంస్థ విలువ దాదాపు రెట్టింపైంది. బరోన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌, సుమేరు వెంచర్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ లేట్‌ స్టేజ్‌ టెక్‌ ఫండ్‌, కోటక్‌, యాక్సిస్‌ గ్రోత్‌ అవెన్యూస్‌ ఏఐఎఫ్‌-1, సిక్స్‌టీంత్‌ స్ట్రీట్‌ క్యాపిటల్‌, గిశాల్లో, స్మైల్‌ గ్రూప్‌ అండ్‌ సెగాంటీ క్యాపిటల్‌ వంటి పెట్టుబడి సంస్థలు తాజా నిధుల సమీకరణలో పాల్గొన్నాయి. ప్రస్తుత పెట్టుబడిదార్లయిన ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌ (ఇంతకు ముందు ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌), ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, ఏఆర్‌కే ఇంపాక్ట్‌, ప్రోసస్‌లు కూడా ఉన్నాయి. ఆరు నెలల క్రితమే 1.25 బిలియన్‌ డాలర్లు సమీకరించినా, తాజాగా నిధుల సమీకరణలో భారత్‌, అంతర్జాతీయ సంస్థాగత మదుపర్లు పాల్గొన్నారని స్విగ్గీ తెలిపింది.


ఓలా ఎలక్ట్రిక్‌ జీ రూ.37,500 కోట్లు
 4 నెలల్లోనే రూ.15000 కోట్లు అధికం

టెక్నే ప్రైవేట్‌ వెంచర్స్‌, ఆల్పిన్‌ ఆపర్చూనిటీ ఫండ్‌, ఎడెల్‌వైజ్‌, ఇతర సంస్థల నుంచి 200 మిలియన్‌ డాలర్లు (దాదాపు   రూ.1490.5 కోట్ల)కు పైగా సమీకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ఈ నిధుల సమీకరణ సందర్భంగా కంపెనీ విలువను 5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.37,500 కోట్లు)గా లెక్కకట్టారు. 2021 సెప్టెంబరులో ఫాల్కన్‌ ఎడ్జ్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, ఇతర సంస్థల నుంచి నిధుల సమీకరించిన సమయంలో కంపెనీ విలువను 3 బి.డాలర్లు (దాదాపు  రూ.22,272 కోట్లు)గా పరిగణించారు. అంటే 4 నెలల్లోనే సంస్థ విలువ రూ.15,000 కోట్లకు పైగా పెరిగినట్లు అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని