2025కు రూ.1.72 లక్షల కోట్లు

డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా, ఆన్‌లైన్‌ డేటాను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన డిజిటల్‌ మౌలిక వసతులు సమకూర్చేందుకు 2025 నాటికి 2,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.72 లక్షల కోట్లు) పెట్టుబడులు

Published : 25 Jan 2022 02:58 IST

డిజిటల్‌ మౌలిక వసతులకు కావాల్సిన మొత్తమిది
ఈవై-డీఐపీఏ సంయుక్త నివేదిక

దిల్లీ: డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా, ఆన్‌లైన్‌ డేటాను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన డిజిటల్‌ మౌలిక వసతులు సమకూర్చేందుకు 2025 నాటికి 2,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.72 లక్షల కోట్లు) పెట్టుబడులు అవసరమవుతాయని ఈవై, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. ‘హెల్త్‌టెక్‌, ఎడ్యుటెక్‌, కన్జూమర్‌ టెక్‌.. ఎందులోనైనా భారత్‌ ముందుంది. ఇ-కామర్స్‌ విపణి 20,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.15 లక్షల కోట్ల)కు, ఎడ్యుటెక్‌ విపణి 1,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.90,000 కోట్ల)కు చేరతాయని అనుకుంటున్నాం. ‘డిజిటల్‌పై భారత్‌ వినూత్న ఆవిష్కరణలు చేస్తోంది. ఈ విప్లవం కొనసాగేందుకు డిజిటల్‌ మౌలిక సదుపాయాలు మరిన్ని అవసరం. టవర్‌ కంపెనీలు డిజిటల్‌ ఇన్‌ఫ్రా కంపెనీలుగా మారుతున్నాయి. వచ్చే 3-5 ఏళ్లలో వీటికి సుమారు 2,000 కోట్ల డాలర్ల (సుమారు  రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడులు అవసరమవుతాయ’ని ఈవై వర్థమాన మార్కెట్ల టీఎంటీ లీడర్‌ ప్రశాంత్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం..

33 కోట్ల మంది ప్రజలు 5జీని వినియోగిస్తారు. ఇ-కామర్స్‌, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలు ఆన్‌లైన్‌లో తమ ఉనికిని మరింత పెంచుకుంటాయి. 2025 నాటికి ఈ విభాగాలకు 1,700-2,300 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి.

మాక్రో టవర్లు, ఫైబర్‌ ఏర్పాటు కోసం చెరో 700-900 కోట్ల డాలర్లు, 5జీ సేవల స్మాల్‌ సెల్స్‌ ఏర్పాటుకు 200-300 కోట్ల డాలర్లు, వైఫై, ఇన్‌-బిల్డింగ్‌ సొల్యూషన్లకు 50-80 కోట్ల డాలర్లు, డేటా సెంటర్ల కోసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని