AIR INDIA: ఎయిరిండియాకు మహారాజా దర్పం

ఎయిరిండియాను స్థాపించిన 21 ఏళ్ల తరవాత జాతీయీకరణకు అంగీకరించిన టాటా గ్రూప్‌.. భారీ నష్టాల పాలవుతున్న ఆ సంస్థను దాదాపు 7 దశాబ్దాల తరవాత మళ్లీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఆధునిక హంగులు, అత్యాధునిక విమానాలతో దేశ, విదేశీ

Updated : 28 Jan 2022 08:46 IST

ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దుతాం: టాటా గ్రూప్‌
ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి రుణాలు

ఎయిరిండియాను స్థాపించిన 21 ఏళ్ల తరవాత జాతీయీకరణకు అంగీకరించిన టాటా గ్రూప్‌.. భారీ నష్టాల పాలవుతున్న ఆ సంస్థను దాదాపు 7 దశాబ్దాల తరవాత మళ్లీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఆధునిక హంగులు, అత్యాధునిక విమానాలతో దేశ, విదేశీ విపణుల్లో మహారాజా దర్పంతో వెలుగులీనిన ఎయిరిండియా.. నిర్వహణ లోపాల వల్ల మార్కెట్‌ వాటాను గణనీయంగా కోల్పోయింది. రోజుకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్న ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్వహించిన బిడ్డింగ్‌లో టాటా సన్స్‌ విజయం సాధించి, మళ్లీ యజమానిగా మారింది.


ఉన్నత ప్రమాణాలతో, ప్రపంచస్థాయి సంస్థగా ఎయిరిండియాను తీర్చిదిద్దేందుకు టాటా గ్రూప్‌ నిబద్ధతతో పని చేస్తుందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో సంస్థను స్వాధీనం చేసుకునే ముందు ప్రధాని నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ‘ఈ చారిత్రక పరిణామానికి సంస్కరణలపై ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధతే హేతువైంది. విమానయాన సేవలను ఇంకా విస్తరించడంతో పాటు మరింతమంది సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న ప్రధాని ఆకాంక్షను సాకారం చేసేందుకు టాటా గ్రూప్‌ పనిచేస్తోంది.  ఎయిరిండియా ఉద్యోగులందర్నీ మా గ్రూప్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి పని చేద్దామ’ని టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి చంద్రశేఖరన్‌ తెలిపారు.

దిల్లీ: ఎయిరిండియా యాజమాన్య బదిలీ గురువారం పూర్తయింది. విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్‌, ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ దేవ్‌ దత్‌ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియాకు చెందిన 100 శాతం షేర్లను టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన టాలెస్‌ ప్రై.లి.కు బదిలీ చేయడంతో పాటు, యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. కొత్త సంస్థకు సంబంధించిన బోర్డు ఇకపై ఎయిరిండియా బాధ్యతలను చూసుకుంటుందని తెలిపారు. గత ఏడాది అక్టోబరులో టాటా గ్రూప్‌ రూ.18,000 కోట్లతో ఎయిరిండియాకు బిడ్‌ దాఖలు చేసి విజయవంతమైంది. ఇందులో రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు రూ.15,300 కోట్ల రుణాలను టాటా గ్రూప్‌ తీర్చనుంది.  

రూ.46,262 కోట్ల రుణం ఏఐఏహెచ్‌ఎల్‌కే

ఎయిరిండియాకు 2021 ఆగస్టు 31 నాటికి ఉన్న మొత్తం రూ.61,562 కోట్ల రుణాల్లో రూ.15,300 కోట్లను టాటా గ్రూప్‌ తీసుకుంది. మిగిలిన రూ.46,262 కోట్లను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏఐ అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు (ఏఐఏహెచ్‌ఎల్‌) బదిలీ చేశారు. స్థిరాస్తులతో పాటు ఎయిరిండియా ప్రధానేతర ఆస్తుల్ని ఇది  కలిగి ఉంది.  


ఎయిరిండియా ప్రస్థానం ఇదీ

యిరిండియాను 1932లో టాటా గ్రూప్‌ వ్యవస్థాపకులైన జేఆర్‌డీ టాటా టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో  ప్రారంభించారు. దేశంలో తొలి విమానయాన సంస్థ ఇది. అవిభక్త భారతావనిలో కరాచీ నుంచి ముంబయికి ఉత్తరాల సర్వీసుతో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1946లో టాటా సన్స్‌కు చెందిన విమానయాన విభాగం ఎయిరిండియా పేరుతో నమోదైంది. 1948లో ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ ఐరోపాకు విమాన సర్వీసుల్ని ప్రసిద్ధ ‘మహారాజా మస్కట్‌తో’ ప్రారంభించింది. భారత్‌లో తొలి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద అంతర్జాతీయ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం, టాటాల వాటా 25 శాతం కాగా, మిగతాది ప్రజలకు ఉండేది.  1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంస్థను జాతీయం చేశాక, నాలుగు దశాబ్దాల పాటు ఎదురులేని విధంగా సాగింది.


ప్రైవేటు సంస్థలను అనుమతించాకే కష్టాలు

1994-95లో విమానయాన రంగంలోకి ప్రైవేటు సంస్థల్ని అనుమతించడంతో, వారు విపణిలోకి చొచ్చుకుపోయేందుకు అతి చౌక ధరలకు టికెట్లు విక్రయించడం మొదలుపెట్టారు. దీంతోపాటు ముఖ్య విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వల్ల ఎయిరిండియా మార్కెట్‌ వాటా కోల్పోతూ వచ్చింది. 2000-01లో అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో 40 శాతం వాటా విక్రయించేందుకు ప్రయత్నించగా, ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక, ఎయిరిండియా యేటా నష్టపోతూ వచ్చింది. 2004-14 సంవత్సరాలలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ సంస్థనూ ప్రైవేటీకరించలేదు. 2012లో ఎయిరిండియా కోసం పునరుద్ధరణ ప్రణాళిక (టీఏపీ), ఆర్థిక పునర్నిర్మాణ ప్రణాళికను (ఎఫ్‌ఆర్‌పీ) కూడా ఆమోదించింది.


మోదీ నేతృత్వంలో

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సీపీఎస్‌ఈల ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చింది. 2017 జూన్‌లో ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఎయిరిండియా, దాని 5 అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 2018 మార్చిలో ఎయిరిండియాలో 76 శాతం, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రయత్నించినా, ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. 2020 జనవరిలో ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం ‘సై’ అన్నా, 2019 మార్చి 31 ఆఖరుకు సంస్థకున్న రూ.60,074 కోట్ల రుణాల్లో రూ.23,286.5 కోట్లను భరించాలనడంతో సంస్థలు ముందుకు రాలేదు. గత దశాబ్దకాలంలో ఎయిరిండియాకు  రూ.1.10 లక్షల కోట్లను నగదు సహాయం, రుణ గ్యారెంటీల కింద ప్రభుత్వం అందించింది.


కొవిడ్‌ సమయంలో

కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో గతేడాది విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ సందర్భంలోనే 2021 మార్చిలో అప్పటి పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ‘రోజుకు రూ.20 కోట్ల నష్టం వస్తున్న ఎయిరిండియాను విక్రయించలేక పోతే మూసేయాల్సి వస్తుంద’ని పేర్కొన్నారు. ఆ వెంటనే 2021 ఏప్రిల్‌లో ఎయిరిండియాకు బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కొత్త యజమానులు ఎయిరిండియా నష్టాల్ని క్యారీ ఫార్వార్డ్‌ చేసుకుని, భవిష్యత్‌లో వచ్చే లాభాలతో సెటాఫ్‌ చేసుకోవచ్చని వెసులుబాటునూ ప్రభుత్వం ఇచ్చింది. టాటా గ్రూప్‌తో పాటు స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ నేతృత్వంలోని కన్సార్షియం బిడ్లు దాఖలు చేశాయి. 2021 అక్టోబరు 8న టాటా గ్రూప్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ప్రభుత్వం ప్రకటించింది.

2022 జనవరి 27న ఎయిరిండియా యాజమాన్యాన్ని టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రై.లి.కు అప్పగించారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు)ను ప్రైవేటీకరించడం 2003-04 తరవాత మళ్లీ  ఎయిరిండియాతో ప్రారంభమైంది.


ఎస్‌బీఐ నుంచి రుణసాయం

యిరిండియా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు టాటా గ్రూప్‌నకు రుణాలు ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం అంగీకరించింది. ఈ కన్సార్షియంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి పెద్ద బ్యాంకులున్నాయి. సంస్థ అవసరాల మేరకు రుణాలు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అందించనున్నారు.

ఎయిరిండియా పుంజుకుంటుంది

- జ్యోతిరాదిత్య సింధియా

‘కొత్త యాజమాన్య చేతుల్లో ఎయిరిండియా పుంజుకుంటుంది. దేశీయంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన రంగానికి మార్గం సుగమం చేస్తుంద’ని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఎయిరిండియాలోకి వ్యూహాత్మక పెట్టుబడిదారు రావడం విశేషమన్నారు. భవిష్యత్‌లో వ్యూహాత్మకేతర రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం సమర్థంగా ఎలా నిర్వహిస్తుందో అనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.


ఇప్పుడేం జరుగుతుంది?

కనీసం ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్‌ కొనసాగిస్తుంది.

ఎయిరిండియాకు చెందిన వెడల్పైన- సన్నని విమానాలు 117, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24 సన్నని విమానాలు టాటా గ్రూప్‌ ఆధీనంలోకి వచ్చాయి.

దేశీయ విమానాశ్రయాల్లో 4400 దేశీయ, 1800 అంతర్జాతీయ మార్గాల స్లాట్లు, సంస్థకు లభిస్తాయి.

టాటా గ్రూప్‌నకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా, మలేసియాకు చెందిన ఎయిరేసియా భాగస్వామ్యంలో ఎయిరేసియా ఇండియాలో కూడా మెజార్టీ వాటాలున్నాయి.  

1953లో ఎయిరిండియాను జాతీయీకరణ చేసినపుడు నెహ్రూ ప్రభుత్వం టాటా గ్రూప్‌నకు రూ.2.8 కోట్లు చెల్లించి 100 శాతం వాటా కొనుగోలు చేసింది. గణనీయంగా విస్తరించిన అదే సంస్థను 69 ఏళ్ల తర్వాత రూ.18,000 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్‌ చేజిక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని