800 టన్నుల బంగారు భారత్‌

కొవిడ్‌ పరిణామాలున్నా, గతేడాది దేశంలో 797.3 టన్నుల బంగారం వినిమయం అయ్యిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగు పడటంతో గిరాకీ

Published : 29 Jan 2022 03:50 IST

2021లో వినియోగం 79 శాతం పెరిగింది: డబ్ల్యూజీసీ

కొవిడ్‌ పరిణామాలున్నా, గతేడాది దేశంలో 797.3 టన్నుల బంగారం వినిమయం అయ్యిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగు పడటంతో గిరాకీ అధికమైందని, ఈ ఏడాదీ సానుకూలంగానే ఉంటుందని పేర్కొంది. 2020లో దేశీయంగా 446.4 టన్నుల బంగారానికే గిరాకీ లభించినందున, దానితో పోల్చితే 2021లో 78.6 శాతం వృద్ధి లభించిందని ‘పసిడి గిరాకీ ధోరణులు-2021’ నివేదికలో వెల్లడించింది. పండుగల సీజన్‌కు తోడు వివాహాలు అధికంగా చోటుచేసుకున్న అక్టోబరు-డిసెంబరులోనే 343 టన్నుల బంగారానికి గిరాకీ లభించింది. ఇందులో ఆభరణాల వాటాయే 265 టన్నులని, ఇదే పరిశ్రమకు అత్యుత్తమ త్రైమాసికంగా నిలిచిందని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సోమసుందరం పేర్కొన్నారు. తమ గరిష్ఠ అంచనాలను మించి డిసెంబరు త్రైమాసికంలో గిరాకీ లభించిందని వెల్లడించారు. ఈ ఏడాది పసిడికి గిరాకీ కొవిడ్‌ ముందుస్థాయికి చేరినా కూడా, 2021 అక్టోబరు-డిసెంబరు నాటి వినియోగస్థాయి లభించకపోవచ్చని వివరించారు. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల కోసం 79 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని, ఇది 8 ఏళ్ల గరిష్ఠస్థాయిగా పేర్కొన్నారు. 2021లో ఆభరణాలకు లభించిన గిరాకీ ఆరేళ్ల గరిష్ఠస్థాయిగా తెలిపారు. తక్కువమందితో శుభకార్యాలు నిర్వహించినందున, ఆదా అయిన మొత్తంతో బంగారం కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. ఆభరణాల తయారీదార్లు, విక్రేతలు హాల్‌మార్కింగ్‌ నిబంధనలకు అనుగుణంగా కొత్తవి తయారు చేసుకునేందుకు అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నారని తెలిపారు. 2022లో మొత్తం 800-850 టన్నుల పుత్తడి దేశీయంగా వినియోగం కావచ్చని అంచనా వేశారు.

ఈ ఏడాది పసిడి గిరాకీని ప్రభావితం చేసే అంశాలు: కొవిడ్‌ 19 కేసులు, పసిడి ధరలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు

అంతర్జాతీయంగా: 2021లో ప్రపంచవ్యాప్తంగా 4021.3 టన్నుల పుత్తడికి గిరాకీ ఏర్పడింది. 2020 నాటి 3658.8 టన్నులతో పోలిస్తే, ఇది 10 శాతం ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని