డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.707 కోట్ల లాభం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి రూ.5,320 కోట్ల ఆదాయాన్ని, రూ.707 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం

Updated : 29 Jan 2022 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి రూ.5,320 కోట్ల ఆదాయాన్ని, రూ.707 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.4,930 కోట్లు, నికరలాభం రూ.19.8 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 8 శాతం, నికరలాభం 3468 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ.5,763 కోట్ల ఆదాయం, రూ.992 కోట్ల నికరలాభంతో  పోలిస్తే, ఆదాయం 8 శాతం, నికరలాభం 29 శాతం తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి ఆదాయం రూ. 16,002 కోట్లు, నికరలాభం రూ.2,269 కోట్లుగా నమోదయ్యాయి.

మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు సంస్థ సహ-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌  చెప్పారు. నూతన ఔషధ కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.  

ప్రాంతాల వారీగా: మనదేశంతో పాటు అమెరికాలో డాక్టర్‌ రెడ్డీస్‌ 7 శాతం చొప్పున వృద్ధి సాధించగా, ఐరోపాలో ప్రతికూల వృద్ధి కనిపించింది. అతిపెద్ద విపణి అయిన ఉత్తర అమెరికా లో 4 కొత్త ఔషధాలు- కార్‌ముస్టిన్‌ ఇంజక్షన్‌, ఎఫిడ్రిన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్‌, వల్సార్టన్‌, వెన్లాఫాగ్జిన్‌ ఈఆర్‌ ట్యాబ్లెట్లు విడుదల చేసినట్లు సంస్థ వెల్లడించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద అనుమతి కోసం 91 జనరిక్‌ ఔషధ దరఖాస్తులు చేసినట్లు పేర్కొంది.

కొవిడ్‌పై: కొవిడ్‌ ఔషధాల విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వివరించింది. ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌, 2-డీజీ, స్పుత్నిక్‌ వి టీకా, మోల్నుపిరవిర్‌ ఔషధాలను మనదేశంతో పాటు ఇతర దేశాలకూ అందిస్తున్నట్లు పేర్కొంది. స్పుత్నిక్‌ లైట్‌ టీకాపై క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేశామని, ఇంకా కొన్ని కొవిడ్‌ ఔషధాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది.

పిల్లలకు ‘స్పుత్నిక్‌ ఎం’ టీకా?:  పిల్లల కోసం రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా, ‘స్పుత్నిక్‌ ఎం’ ను మనదేశంలో పంపిణీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం భారత ఔషధ నియంత్రణ మండలిని సంప్రదించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ‘స్పుత్నిక్‌ ఎం’ టీకాను 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఇవ్వడానికి రష్యాలో అనుమతి వచ్చింది. దీనిపై అక్కడ నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని మనదేశంలో ఔషధ నియంత్రణ మండలికి త్వరలో అందజేయనున్నట్లు వివరించింది. దీనిపై అవసరం అయితే మనదేశంలోనూ క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.
* సింగిల్‌ డోసు కరోనా టీకా ‘స్పుత్నిక్‌ లైట్‌’ పై మనదేశంలో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని ఔషధ నియంత్రణ మండలికి డాక్టర్‌ రెడ్డీస్‌ అందజేసింది. దీనికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సంస్థ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని