Financial Planning:ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ప్లానింగ్ ఎలా ఉంటే మంచిది..?

రిటైర్మెంట్‌ త‌ర్వాత వ‌చ్చే పీఎఫ్‌, గ్రాట్యుటీ మొత్తాలపైనే పదవీ విరమణ ఉద్యోగులు ఆధారపడాలి. కాబట్టి వాటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Updated : 24 Jan 2022 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగ విర‌మ‌ణ చేసిన వారికి కొన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయి. అందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుంటే ఉద్యోగ అనంతరం జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఎలా సంతోషంగా గ‌డ‌పాలో కొన్ని విష‌యాల గురించి చర్చిద్దాం. రిటైర్ అయిన ఉద్యోగులు రోజువారీ ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత వచ్చే నెల‌వారీ పెన్షన్‌పై ఆధార‌ప‌డ‌తారు. ఈ పెన్షన్‌ నెల అవ‌స‌రాల‌కు ఎంత మాత్రం స‌రిపోదు. కాబట్టి రిటైర్మెంట్‌ త‌ర్వాత వ‌చ్చే పీఎఫ్‌, గ్రాట్యుటీ మొత్తాలపైనే ఆధారపడాలి. కాబట్టి వాటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మీ ఈపీఎఫ్ వృద్ధి చెంద‌నివ్వండి: మీరు రిటైర్ అయిన త‌ర్వాత కూడా మీ ఈపీఎఫ్‌లో సేక‌రించిన మొత్తం పీఎఫ్ సంస్థలోనే ఉంచేస్తే 36 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీని పొందొచ్చు. పీఎఫ్‌ స్కీమ్‌కు చక్రవడ్డీ ఉంటుంది కాబ‌ట్టి సంపాదించిన వ‌డ్డీపై కూడా వ‌డ్డీని పొందుతారు. కాబ‌ట్టి మీకు ఈ పీఎఫ్ డ‌బ్బు వెంట‌నే అవ‌స‌రం లేకుంటే, దానిని పెర‌గ‌డానికి అక్కడే ఉంచడం మంచిది. 3 సంవ‌త్సరాల తర్వాత మీరు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. బ్యాలెన్స్‌పై వ‌డ్డీని పొందాల‌నుకుంటే పాక్షికంగా కూడా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

కొన‌సాగుతున్న బ‌కాయిలు తీర్చేయండి: మీరు రిటైరయిన త‌ర్వాత కూడా మీ ఇంటి రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం మ‌రేదైనా అధిక వ‌డ్డీ రుణాల ఈఎంఐలు మిగిలి ఉండొచ్చు. ఆ ఈఎంఐలను కొనసాగనివ్వొద్దు. పీఎఫ్‌, గ్రాట్యుటీ నిధిని ఒకేసారి లేదా సాధార‌ణ ముంద‌స్తు చెల్లింపుల ద్వారా బ‌కాయిల‌ను సెటిల్ చేసేయండి. దీనివ‌ల్ల పాత అప్పులు తీరిపోతాయి.

మోడ‌రేట్ రిస్క్ పెట్టుబ‌డుల‌వైపు చూడండి: మీకున్న ఆర్థిక ప‌రిస్థితులు ప‌ర‌వాలేద‌నిపిస్తే వివిధ పెట్టుబ‌డుల‌కు ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ నిధుల‌ను కేటాయించండి. మ‌రీ అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల‌వైపు వెళ్లకపోవడం మంచిది. పోస్టాఫీసు సేవింగ్స్‌, ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), మ్యూచువ‌ల్ ఫండ్స్ అందించే బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ స్కీమ్‌లు, డెట్ ఓరియెంటెడ్ హైబ్రిడ్ మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ల్లో పెట్టుబ‌డి పెట్టడం గురించి ఆలోచించండి.

క్రమమైన నగదు స్వీకరణ వైపు అడుగులు వేయండి: రిటైర్‌మెంట్ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా పెన్షన్‌తో పాటు వేరే ఆదాయం వ‌చ్చే మార్గాలు వైపు చూడండి. మీ అవ‌స‌రాన్ని బ‌ట్టి పోస్టాఫీసు సేవింగ్స్‌లో నెల‌వారీ, త్రైమాసిక వ‌డ్డీ వ‌చ్చేలా ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌)లో 5 ఏళ్లకు ఏక మొత్తంలో రూ. 10 లక్షలు పెట్టుబ‌డి పెడితే ప్రస్తుతం 7.4% వ‌డ్డీని పొందుతారు. త్రైమాసికంలో రూ.18,500 వ‌డ్డీని అందుకుంటారు. ఇలా 5 సంవ‌త్సరాలకు రూ.3,70,000 వ‌డ్డీ ఆదాయాన్ని పొందుతారు. ఇలాగే మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌ (ఎస్‌డ‌బ్ల్యూపీ)ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇవన్నీ మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి మీరు రెగ్యుల‌ర్ అద‌న‌పు ఆదాయాన్ని పొందేలా చేస్తాయి.

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి: యాడ్‌ ఆన్ ఫీచ‌ర్లు క‌లిగిన ఆరోగ్య బీమాను తీసుకోవ‌డం ఎప్పుడూ మ‌ర్చిపోవ‌ద్దు. వైద్యపరమైన ఎమ‌ర్జెన్సీలు మీ ఆర్థిక స్థితిని చాలా చికాకుల్లో నెట్టివేయ‌గ‌ల‌వ‌ని గ‌మ‌నించాలి. ఏ స‌మ‌యంలోనైనా ఉప‌యోగ‌ప‌డేలా అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోండి. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత మీ వ‌ద్ద క‌నీసం రూ.5 లక్షల నిధిని అందుబాటులో ఉంచుకోవ‌డం మంచిది. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య ప‌ర‌మైన అత్యవసర స్థితికి లేదా ఏదైనా ఇతర ఊహించని బాధ్యతలను తీర్చడానికి ఉపయోగపడొచ్చు. ఈ మొత్తాన్ని సాధార‌ణ బ్యాంక్ డిపాజిట్‌, లిక్విడ్ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కంలో ఉంచండి. మరిన్ని వివరాల కోసం అవ‌స‌ర‌మైతే ప్రొఫెష‌న‌ల్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ల నుంచి స‌ల‌హాల‌ను కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని