Budget 2022: బయోగ్యాస్‌ ఫర్టిలైజర్ ఫండ్‌ ఏర్పాటుకు ఐబీఏ డిమాండ్‌

‘బయోగ్యాస్‌ ఫర్టిలైజర్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలని భారత బయోగ్యాస్‌ సమాఖ్య (ఐబీఏ) కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.....

Updated : 26 Jan 2022 19:48 IST

దిల్లీ: ‘బయోగ్యాస్‌ ఫర్టిలైజర్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలని భారత బయోగ్యాస్‌ సమాఖ్య (ఐబీఏ) కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అందుకోసం రానున్న ఐదేళ్లకుగానూ రూ.1.4 లక్షల కోట్లు కేటాయించాలని కోరింది. దీనివల్ల ఐదు కోట్ల రైతులు లబ్ధి పొందుతారని తెలిపింది. ప్రభుత్వానికి శిలాజ ఇంధనాల దిగుమతి వ్యయం సైతం తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు బడ్జెట్‌-2022లో ప్రతిపాదనలు ఉండాలని కోరింది. 

‘సస్టైనబుల్‌ ఆల్టర్నేటివ్‌ టువర్డ్స్‌ అఫర్డబుల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌’ పథకం కింద 5,000 బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందేనని ఐబీఏ తెలిపింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా ఈ ఫండ్ దోహదం చేస్తుందని పేర్కొంది.

మరోవైపు బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమయ్యే సాధనాలపై ఉన్న జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచనున్నట్లు ఇటీవల జీఎస్టీ మండలి నోటిఫై చేసిందని ఐబీఏ గుర్తుచేసింది. ఈ నిర్ణయం బయోగ్యాస్‌ విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనేక అడ్డంకులను సృష్టిస్తుందని పేర్కొంది. పర్యావరణ మార్పుల కట్టడికి బయోగ్యాస్‌ పరిశ్రమ వృద్ధి అనివార్యమని తెలిపింది. కాబట్టి ఇండస్ట్రీవ్యాప్తంగా జీఎస్టీ సున్నా శాతం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఏటా 62.2 మిలియన్‌ టన్నుల బయోగ్యాస్‌/బయో-సీఎన్‌జీ/సీబీజీ/ఆర్‌ఎన్‌జీ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయాలంటే.. బయోగ్యాస్‌ ఫర్టిలైజర్‌ ఫండ్‌ అనివార్యమని ఐబీఐ అభిప్రాయపడింది. ఈ ఫండ్‌ నుంచి రూ.1లక్ష కోట్లను క్రెడిట్‌ గ్యారంటీ స్కీంకు కేటాయించాలని కోరింది. మిగిలిన మొత్తాన్ని ఉత్పత్తి ఆధారిత రాయితీ కింద ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ చర్యల వల్ల ముడి చమురు దిగుమతి, రసాయన ఎరువుల రాయితీ రూపంలో ప్రభుత్వం ఖజానాపై పడుతున్న భారం తగ్గుతుందని తెలిపింది. అలాగే గ్రీన్‌హౌస్ వాయువుల కట్టడి.. తద్వారా కాప్‌-26 పర్యావరణ లక్ష్యాల్ని చేరుకోవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని