Services PMI: ఆరు నెలల కనిష్ఠానికి సేవారంగ కార్యకలాపాలు

సెప్టెంబరులో సేవారంగ కార్యకలాపాల్లో వృద్ధి నెమ్మదించింది. పీఎంఐ సూచీ 6 నెలల కనిష్ఠానికి పడిపోయింది.

Published : 06 Oct 2022 18:23 IST

దిల్లీ: దేశీయ సేవారంగ కార్యకలాపాలు సెప్టెంబరు నెలలో ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. కొత్త ఆర్డర్లు తగ్గడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కంపెనీల మధ్య పోటీ వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయని ఓ ప్రముఖ సర్వే పేర్కొంది. ప్రతినెలా ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ విడుదల చేసే భారత సేవారంగ ‘పర్చేజింగ్‌ మానుఫాక్చరింగ్ ఇండెక్స్‌’ సెప్టెంబరులో 54.3గా నమోదైంది. ఆగస్టులో ఇది 57.2గా ఉంది.

అయితే, వరుసగా 14వ నెలలోనూ సేవారంగ కార్యకలాపాలు వృద్ధి బాటలో పయనించాయి. పీఎంఐ 50 ఎగువన నమోదైతే వృద్ధిగా.. దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ‘‘భారత సేవారంగం ఇటీవల అనేక సవాళ్లను అధిగమించింది. తాజా పీఎంఐ సూచీ బలమైన వృద్ధిని సూచిస్తోంది. అయితే, సెప్టెంబరులో కొంత వేగం మాత్రం తగ్గింది. ద్రవ్యోల్బణం, పోటీ వంటి అంశాలు సేవలపై ప్రభావం చూపాయి. నెలాఖరులో రూపాయి భారీగా క్షీణించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. దీని వల్ల దిగుమతి చేసుకునే ముడి సరకుల ధరలు పెరుగుతాయి’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలీయానా డీ లిమా తెలిపారు.

విదేశీ ఆర్డర్లు తగ్గడం కూడా దేశీయ సేవారంగంపై ప్రభావం చూపినట్లు పీఎంఐ సర్వేలో తేలింది. ఇంధన, ఆహారం, ముడి సరకులు, శ్రామికుల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో మున్ముందు వ్యయాలు మరింత పెరగనున్నట్లు పేర్కొంది. ఉద్యోగ కల్పన సైతం తగ్గుముఖం పట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని