Paytm: పేటీఎం సీఈఓగా మళ్లీ ఆయనే..

ప్రముఖ డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా మళ్లీ విజయ్‌ శేఖర్‌ శర్మనే కొనసాగనున్నాయి. ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ

Published : 21 May 2022 18:31 IST

దిల్లీ: ప్రముఖ డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా మళ్లీ విజయ్‌ శేఖర్‌ శర్మనే కొనసాగనున్నారు. ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌ సందర్భంగా పేటీఎం శనివారం వెల్లడించింది. 2027 డిసెంబరు 18వ తేదీ వరకు విజయ్‌ ఎండీ, సీఈఓగా కొనసాగనున్నారు. ఇక పేటీఎం చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఉన్న మధుర్‌ దేవరాను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

బీమా కంపెనీలో రూ.950 కోట్ల పెట్టుబడులు..

పేటీఎం జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ లిమిటెడ్‌ (PGIL) పేరుతో ఓ సంయుక్త బీమా కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా బోర్డు ఆమోదించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. తొలుత ఈ కంపెనీలో పేటీఎం మాతృక సంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌కు 49శాతం వాటా ఉంటుందని, విజయ్‌ శేఖర్‌ శర్మకు చెందిన మరో కంపెనీ వీఎస్‌ఎస్‌ హోల్డింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 51శాతం వాటా ఉండనుందని కంపెనీ వెల్లడించింది. ఈ బీమా కంపెనీలో రానున్న 10ఏళ్లలో రూ.950కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. పెట్టుబడులు పూర్తయిన తర్వాత బీమా కంపెనీలో పేటీఎం వాటా 74శాతానికి పెరగనుందని తెలిపింది.

శుక్రవారం పేటీఎం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి(జనవరి-మార్చి) త్రైమాసికంలో వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఏకీకృత నష్టాలు మరింత పెరిగి రూ.761.4 కోట్లకు చేరాయి. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.441.8 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.815.3 కోట్ల నుంచి 89 శాతం వృద్ధి చెంది రూ.1,540.9 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2021-22) నష్టాలు రూ.2,396.4 కోట్లకు పెరిగాయి. 2020-21 నష్టం రూ.1,701 కోట్లే. వార్షిక ఆదాయాలు మాత్రం 77.49% పెరిగి రూ.4,974.2 కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని