Credit Card: క్రెడిట్‌ కార్డు వాడ‌కం ప్రమాదకరస్థాయికి చేరుకుందని గుర్తించడమెలా..?

క్రెడిట్‌ కార్డు ఖ‌ర్చుపై నియంత్రణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క‌ష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదమూ ఉంది.

Updated : 20 Jan 2022 17:30 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డుతో చాలా లాభాలు ఉంటాయి. వ‌డ్డీ ర‌హిత కాల‌వ్యవధితో కొనుగోలు శ‌క్తి పెంచుకోవ‌డంతో పాటు రివార్డు పాయింట్ల రూపంలో అద‌న‌పు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. బాధ్యతాయుతంగా ఉప‌యోగిస్తే బ‌ల‌మైన క్రెడిట్ స్కోరును నిర్మించుకోవ‌చ్చు. దీంతో భ‌విష్యత్‌లో రుణాలు సుల‌భంగా ఆమోదం పొంద‌డంతో పాటు, మంచి మంచి ఆఫ‌ర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. అదే స‌మ‌యంలో ఖ‌ర్చుపై నియంత్రణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క‌ష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదమూ ఉంది. అందువ‌ల్ల క్రెడిట్ కార్డును స‌రైన ప‌ద్ధతిలో సమర్థంగా ఉప‌యోగిస్తున్నార‌ని నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఈ ఐదు సూచికలు మీకు స‌హాయ‌ప‌డ‌తాయి.

మినిమమ్‌ డ్యూ చెల్లించ‌డం

క్రెడిట్ కార్డుపై వ‌డ్డీ లేని కాల‌వ్యవధి ఉంటుందన్న విషయం తెలిసిందే. కార్డును ఉప‌యోగించి వ‌స్తువులు కొనుగోలు చేసినా, బిల్లు తేదీలోపు ఔట్‌ స్టాండింగ్‌ మొత్తాన్ని చెల్లించగలిగితే మీరు సమర్థంగ క్రెడిట్‌ కార్డును వినియోగిస్తున్నట్లే లెక్క. అలాకాకుండా ఔట్‌ స్టాండింగ్ బ్యాలెన్స్ నుంచి క‌నీస మొత్తాన్ని (సాధార‌ణంగా ఇది బిల్లు మొత్తంలో 5 శాతం ఉంటుంది) మాత్రమే చెల్లిస్తే మీరు ప్రమాదకర స్థితికి చేరువలో ఉన్నట్లే. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ కార్డు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. త‌దుప‌రి వినియోగం కోసం మీ కార్డుపై ఉన్న క్రెడిట్ ప‌రిమితి త‌గ్గిపోతుంది. చెల్లించాల్సిన రుణం కూడా వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే చెల్లించ‌ని మొత్తంపై రోజువారీ ఛార్జీలు విధిస్తాయి కార్డు జారీ సంస్థలు. కొన్ని క్రెడిట్ కార్డుల‌పై వార్షికంగా 40 శాతం వ‌ర‌కు కూడా వ‌డ్డీ విధించే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా కార్డుతో చేసే కొత్త లావాదేవీల‌కు వ‌డ్డీ ర‌హిత కాల‌వ్యవధి ఉండదు. వ‌స్తువులు కొనుగోలు చేసిన మ‌రుస‌టి రోజు నుంచి వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. మీరు ఔట్‌ స్టాండింగ్‌ బిల్లు మొత్తం చెల్లించేంత వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంది. అందువ‌ల్ల స‌మ‌యానికి పూర్తి బిల్లు చెల్లించ‌డం అన్నిటికంటే ముఖ్యం.

గ‌రిష్ఠ పరిమితి వరకు కార్డు వినియోగం

మీ క్రెడిట్ కార్డులో అందుబాటులో ఉన్న గ‌రిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు ఖ‌ర్చుచేయ‌డమనేది మీరు కార్డు స‌రైన విధంగా ఉప‌యోగించ‌డం లేదని తెలిపే మ‌రొక సూచ‌న‌. ఇది మిమ్మల్ని క్రెడిట్ కార్డుపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డేలా చేస్తుంది. క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ స్పెండింగ్ లేదా క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో (సీయూఆర్‌) అనేది.. కార్డుపై అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో దాదాపు 40 శాతం మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక‌వేళ‌ మీరు 50 శాతం సీయూఆర్ రెగ్యుల‌ర్‌గా దాటుతుంటే క్రెడిట్ ప‌రిమితిని పెంచాలని మీ క్రెడిట్ కార్డు జారీ సంస్థను కోరొచ్చు. లేదంటే మరొక క్రెడిట్ కార్డు తీసుకోవ‌చ్చు.

ఏటీఎమ్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా

ఏటీఎమ్ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే వీలుంది. కానీ ఇలా చేయ‌డం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెప్పే మాట. ఎందుకంటే క్రెడిట్ కార్డు న‌గదు విత్‌డ్రా చేసిన ప్రతిసారీ అనేక ఛార్జీలను మీరు బ్యాంకుకు చెల్లించాల్సి రావొచ్చు. కేవలం విత్‌డ్రా ఫీజు మాత్రమే కాకుండా, లావాదేవీకి సంబంధించిన వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఉపసంహరించుకున్న మొత్తంపై రోజువారీ వడ్డీ విధిస్తారు. చాలా సందర్భాల్లో బ్యాంకులు నెలకు 2.5 శాతం నుంచి 4 శాతం మధ్య వడ్డీ రేట్లను విధిస్తుంటాయి. నగదు ఉపసంహరణలపై వడ్డీ రహిత సమయం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నగదు ఉపసంహరణ చేసిన మొట్టమొదటి రోజు నుంచి వడ్డీ విధిస్తారు. వార్షిక వ‌డ్డీ రేటు 48 శాతం వ‌ర‌కు ఉండొచ్చు.

వ‌డ్డీ ర‌హిత కాలం ప్లాన్ చేయ‌క‌పోవ‌డం 

కార్డు ఉప‌యోగించి లావాదేవీ చేసిన తేదీకి, చెల్లింపు గ‌డువు తేదీకి మ‌ధ్య ఉన్న వ్యవధే వ‌డ్డీ ర‌హిత కాలం. ఈ కాలం 18 నుంచి 55 రోజుల వ‌ర‌కు ఉంటుంది. కార్డు జారీ సంస్థ ఈ కాల‌వ్యవధిని నిర్ణయిస్తుంది. కార్డు చెల్లింపులు స‌మ‌యానికి చేసినంత కాలం ఎటువంటి ఛార్జీలూ వ‌ర్తించ‌వు. అందుకే వ‌డ్డీ ర‌హిత కాల‌వ్యవధి అనుగుణంగా చెల్లింపులు ప్లాన్ చేసుకోవాలి. బిల్లింగ్ సైకిల్ ప్రారంభంలో కొనుగోళ్లు చేస్తే.. తిరిగి చెల్లింపుల‌కు ఎక్కువ వ‌డ్డీ ర‌హిత కాలం ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉప‌యోగిస్తున్న వారు బిల్లింగ్ తేదీ విష‌యంలో తిక‌మ‌క ప‌డుతుంటారు. దీంతో స‌మయానికి చెల్లింపులు చేయ‌క ఇబ్బందులు ప‌డుతుంటారు.

రివార్డు పాయింట్లను, గ‌డువు తేదీల‌ను విస్మరించడం

సాధార‌ణంగా క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై సంస్థలు రివార్డు పాయింట్లను ఇస్తుంటాయి. ఈ పాయింట్లు భ‌విష్యత్‌ కొనుగోళ్ల స‌మ‌యంలో రిడీమ్ చేసుకుని రాయితీలు పొందొచ్చు. లేదంటే ఎయిర్‌ర లాంజ్‌లు, హోటళ్లలో వాడుకోవచ్చు. ఈ రివార్డు పాయింట్లు నిర్ణీత స‌మ‌యం త‌ర్వాత చెల్లుబాటుకావు. అందువ‌ల్ల గ‌డువు లోప‌ల ఉప‌యోగించుకోవాలి. క్రెడిట్ కార్డుతో ముడిప‌డి ఉన్న ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని