SSY: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌లో మెచ్యూరిటీకి ముందే డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చా?

సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. త‌ల్లిదండ్రులు 10 సంవ‌త్స‌రాల‌లోపు ఉన్న ఆడ‌పిల్ల‌ల కోసం ఖాతాను తెర‌వొచ్చు. 

Updated : 21 May 2022 14:04 IST

సుకన్య సమృద్ధి యోజ‌న దీర్ఘకాల‌ పొదుపు ప‌థకం. ఆడపిల్లల భవిష్యత్తుకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆడపిల్ల‌ల త‌ల్లిదండ్రులు.. వారి పిల్ల‌ల చిన్న‌త‌నం నుంచి ఈ ప‌థ‌కంలో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు చేస్తూపోతే.. వారి చిన్నారుల ఉన్న‌త‌ విద్య, వివాహ సమయాల్లో అధిక మొత్తంలో డ‌బ్బు చేతికందేలా ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు. అందువ‌ల్ల ఈ ప‌థ‌కంలో సుదీర్ఘ లాక్ - ఇన్ పిరియ‌డ్ ఏర్పాటు చేయడం జ‌రిగింది. 

సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. త‌ల్లిదండ్రులు 10 సంవ‌త్స‌రాల‌లోపు ఉన్న ఆడ‌పిల్ల‌ల కోసం ఖాతాను తెర‌వొచ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ. 250, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు చేయవచ్చు. ఒక ఖాతాలో సంవత్సరానికి అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయకూడదు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవచ్చు. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.6 శాతం. ఖాతాను మీ ద‌గ్గ‌ర‌లోని పోస్టాఫీసు లేదా అధీకృత వాణిజ్య బ్యాంకులో గానీ తెర‌వ‌చ్చు. 

ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు..

మెచ్యూరిటీ స‌మ‌యంలో..
ఖాతా తెరిచిన 21 ఏళ్ల త‌ర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఖాతా నుంచి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఉదాహరణకు పాప‌ 8 సంవత్సరాల వయసులో ఖాతా ప్రారంభిస్తే,  29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. 

ఉన్న‌త విద్య‌, వివాహం కోసం..
సుకన్య సమృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బు తీసుకునే వీలుంది.  పాప‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత లేదా 10వ త‌ర‌గ‌తి పూర్తి చేసుకున్న త‌ర్వాత ఉన్న‌త చ‌దువుల కోసం డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అంద‌కు ముందున్న ఆర్థిక సంవ‌త్స‌రానికి ఖాతాలో స‌మ‌కూరిన మొత్తం నుంచి 50 శాతం వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఫీజు/ఇత‌ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏక మొత్తంగా గానీ, వాయిదాల ప‌ద్ద‌తిలో గానీ సంవ‌త్స‌రానికి ఒక‌సారి చొప్పున, ఐదు సంవ‌త్స‌రాల పాటు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అలాగే వివాహ స‌మ‌యంలోనూ ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. 

ఖాతాను శాశ్వతంగా ఎప్పుడు మూసివేయ‌వ‌చ్చు..
ఈ కింది సంద‌ర్భాల్లో ఖాతా తెరిచిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు.
* ఏదైనా అనుకోని కారణాల చేత ఖాతాదారు మరణిస్తే వెంటనే మరణ దృవీకరణ పత్రము సమర్పించి ఖాతాను మూసివేయవచ్చు.
* ఖాతాదారు ప్రాణాంత‌క వ్యాధుల భారిన ప‌డిన‌ప్పుడు
* ఖాతా నిర్వ‌హిస్తున్న గార్డియ‌న్ మ‌ర‌ణించిన‌ప్పుడు
పై సంద‌ర్భాల్లో ఖాతాను మూసివేయాల‌నుకుంటే.. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు, పాస్‌బుక్‌, ఇత‌ర కావాల్సిన అన్ని ప‌త్రాల‌ను ఖాతా ఉన్న పోస్టాఫీసు/బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.  

వివాహ స‌మ‌యంలో పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు..
ఖాతాదారులకి 18 సంవత్సరాల వయస్సు పూర్తై, ఆమెకు వివాహం జరిగినట్లైయితే, ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది. వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చాక ఖాతాను పూర్తిగా ముగించవచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని