
Education Loan: విదేశాల్లో మీ పిల్లల చదువుకు డబ్బు సరిపోలేదా?టాప్-అప్ లోన్ తీసుకోవచ్చా?
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును తట్టుకోవడం సామాన్యులకు భారమే. ఇక విదేశాల్లో విద్య గురించి చెప్పాల్సిన అసవరమే లేదు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారిలో అధిక శాతం విద్యార్థులు విద్యా రుణాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక్కోసారి తీసుకున్న రుణ మొత్తం సరిపోకపోవచ్చు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లేదా ఖర్చులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు విద్యార్థులకు మరింత డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు విద్యారుణంపై టాప్-అప్ రుణం తీసుకోవచ్చా?తెలుసుకుందాం!
ఇప్పటికే విద్యా రుణం తీసుకుని ఉండి, తాము ఎంచుకున్న కోర్సుకు మరికొంత మొత్తం అవసరమైతే, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముఖ్యంగా విదేశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నిధులను సమకూర్చేందుకు టాప్-అప్ ఎడ్యుకేషన్ లోన్ (Education Loan) ఎంచుకోవచ్చు. మీ ప్రస్తుత విద్యా రుణం ఉన్న బ్యాంకు నుంచి ఈ టాప్-లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు వద్ద ఇప్పటికే మీ వివరాలు ఉంటాయి కాబట్టి తొందరగానే రుణ ఆమోదం పొందవచ్చు. అయితే, నిధుల కొరత ఎందుకు ఏర్పడిందో బ్యాంకుకు వివరించాలి. అలాగే మీ ప్రస్తుత కోర్సుకు మాత్రమే అదనపు రుణం ఇస్తారు. కొత్త కోర్సు కోసం టాప్-అప్ రుణం అందించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి!
మీ గరిష్ఠ రుణ అర్హత, ఇప్పటికే బకాయి ఉన్న మొత్తం ఆధారంగా టాప్-అప్ లోన్ నిర్ణయిస్తారు. ఉదాహరణకి, మీకు రూ.30 లక్షల రుణం పొందేందుకు అర్హత ఉంది అనుకుంటే.. మీరు ఇప్పటికే రూ.20 లక్షల విద్యారుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు మరో రూ.10 లక్షల వరకు టాప్-అప్ లోన్ తీసుకునేందుకు మీకు అర్హత ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్న రుణ మొత్తం రూ.20 లక్షల్లో ఇప్పటికే రూ.5 లక్షలు తిరిగి చెల్లించి ఉంటే.. రూ.15 లక్షల వరకు టాప్-అప్ లోన్ పొందొచ్చు.
అన్ని బ్యాంకులు టాప్-అప్ లోన్‌ను అందించవు. ఇది బ్యాంకు పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ ప్రస్తుత బ్యాంకు అదనపు రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తే ఇతర బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఎంపిక చేసుకోవచ్చు. కావాలంటే మీ పూర్తి రుణాన్ని కొత్త బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు.
సెక్యూరిటీతో కూడిన విద్యారుణం తీసుకుంటే.. అంటే బ్యాంకు వద్ద మీ ఆస్తిని హామీగా ఉంచి రుణం తీసుకుంటే.. హామీ ఇచ్చిన ఆస్తి విలువతో బ్యాంకు అందించే రుణ విలువ ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం విద్యారుణంపై వర్తించే వడ్డీ రేటు కంటే టాప్-అప్ విద్యారుణం వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందని గమనించాలి! టాప్-అప్ ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ రేటు 12 నుంచి 15 శాతం మధ్య ఉండొచ్చు! రుణ మొత్తం, కాలపరిమితి, మార్కెట్ పరిస్థితులు, విద్యార్థుల అకడమిక్ రికార్డ్, విద్యా సంస్థ వంటి అనేక ఇతర అంశాలనూ పరిగణలోకి తీసుకుని బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.