Union Budget 2022: ఒమిక్రాన్‌ భయం.. బడ్జెట్‌ ‘హల్వా’ లేదు.. ఈ సారి స్వీట్లతోనే సరి..!

కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2022)కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో ‘హల్వా (Halwa) వేడుక’ను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్

Updated : 28 Jan 2022 12:14 IST

(పాత చిత్రం)

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2022)కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో ‘హల్వా (Halwa) వేడుక’ను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఈ వేడుకను ఆర్థిక శాఖ పక్కనబెట్టింది. అందుకు బదులుగా స్వీట్లు ఇవ్వనుంది. బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ‘లాక్‌-ఇన్‌’లో ఉండే సిబ్బందికి తుది రోజు మిఠాయిలు పంచనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఏంటీ  హల్వా వేడుక..

బడ్జెట్‌ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు. ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలోని బేస్‌మెంట్‌లో గల  ప్రింటింగ్‌ ప్రెస్‌లో బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపడుతారు. సాధారణంగా ఏటా ఈ పత్రాల ముద్రణకు ముందు భారతీయ వంటకమైన హల్వాను వండుతారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. 

అయితే ఈ ఏడాది కూడా కేంద్ర వార్షిక బడ్జెట్‌ కాగిత రహితంగా ఉండనున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను ముద్రించనున్నట్లు ఆర్థికశాఖ ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే హల్వా వేడుకను కూడా నిర్వహించట్లేదు. ‘‘కరోనా ఉద్ధృతి దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి సంప్రదాయ హల్వా వేడుకను చేయట్లేదు. అందుకు బదులుగా లాక్‌ -ఇన్‌లో ఉన్న సిబ్బందికి బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది రోజున స్వీట్లు పంచనున్నాం’’ అని ఆర్థికశాఖ వెల్లడించింది.

అప్పటిదాకా సిబ్బంది క్వారంటైన్‌లోనే..

బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే.. ఆర్థిక శాఖ సిబ్బంది లాక్‌ ఇన్‌లోకి వెళ్లిపోతారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకూ వారికి ఆర్థికశాఖ కార్యాలయంలోనే వసతులు కల్పిస్తారు. వారు కనీసం కుటుంబసభ్యులతోనూ ఫోన్లో మాట్లాడేందుకు వీలుండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే సదరు సిబ్బంది క్వారంటైన్‌ నుంచి బయటకు వస్తారు.

మోదీ హయాంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో కొత్త కొత్త సంప్రదాయాలు తీసుకొస్తున్నారు. అంతకుముందు బడ్జెట్‌ కాపీలను లెదర్‌ సూట్‌కేసులో తీసుకురాగా.. నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పద్దుల సంచీతో కన్పిస్తున్నారు. ఇక, బడ్జెట్‌ను కూడా డిజిటల్‌ రూపంలోకి మార్చారు. ఆర్థిక మంత్రి ట్యాబ్‌లో చూస్తూ బడ్జెట్‌ ప్రసంగం చేయనున్నారు. ఇక పార్లమెంట్ సభ్యులతో పాటు సాధారణ ప్రజలకు కూడా బడ్జెట్‌ డిజిటల్‌ కాపీలనే అందించనున్నారు. ఇందుకోసం గతేడాది ప్రత్యేకంగా ఓ మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించారు. www.indiabudget.gov.in నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, బడ్జెట్‌ పత్రాలను చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని