Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు షాక్‌.. మళ్లీ పెరగనున్న ఛార్జీలు..!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafoe Idea) మరోసారి యూజర్లకు

Published : 25 Jan 2022 11:46 IST

దిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafoe Idea) మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా మొబైల్‌ సర్వీసు రేట్లు పెరిగే అవకాశముందని కంపెనీ సీఈవో, ఎండీ రవీందర్‌ తక్కర్‌ వెల్లడించారు. అయితే మార్కెట్‌ స్పందను బట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 

కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం సోమవారం జరిగిన సమావేశంలో రవీందర్‌ తక్కర్‌ మాట్లాడారు. ‘‘దాదాపు రెండేళ్ల తర్వాత గతేడాది చివర్లో కాల్‌, డేటా టారిఫ్‌లను పెంచాం. ఇది చాలా సుదీర్ఘ విరామం అని నేను భావిస్తున్నా. ఈ పెంపుతో కనీస వాయిస్‌ ప్లాన్‌ ధర రూ.99గా ఉంది. అయితే 4జీలో ఈ ధరలతో నెలవారీ సేవలు పొందడం పెద్ద ఖర్చేమీ కాదు. అందువల్ల 2022లో మరోసారి టారిఫ్ ధరలను పెంచే అవకాశముంది. ఒక కచ్చితమైన సమయంలో ఛార్జీల పెంపు ఉంటుంది. అయితే నవంబరులో పెంచిన టారిఫ్‌ ధరలపై మార్కెట్‌ స్పందనను బట్టి ఎంత పెంచాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం. అలాగే 2023లోనూ ధరల పెంపు ఉండొచ్చు’’ అని కంపెనీ సీఈవో స్పష్టం చేశారు.

గతేడాది నవంబరులో అన్ని టెలికాం సంస్థలు ధరలను పెంచిన విషయం తెలిసిందే. వొడాఫోన్‌ ఐడియా కూడా ప్రీపెయిడ్‌ ఖాతాదారుల కాల్‌, డేటా టారిఫ్‌లను 18-25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో కంపెనీ వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది. అంతక్రితం ఏడాది 26.98 కోట్లుగా ఉన్న వినియోగదారుల సంఖ్య.. ఛార్జీల పెంపు తర్వాత 24.72 కోట్లకు పడిపోయింది. ఇక టారిఫ్‌ పెంపు చేపట్టినప్పటికీ.. వినియోగదారుడిపై సగటు ఆదాయం (ARPU) రూ.121 నుంచి దాదాపు 5 శాతం తగ్గి రూ.115కు పడిపోయింది.

అప్పుల ఊబిలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా గతవారం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నష్టం మరింత పెరిగి రూ.7,230.9 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.4,532.1 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఏకీకృత కార్యకలాపాల ఆదాయం రూ.10,894.1 కోట్ల నుంచి 10.8 శాతం తగ్గి రూ.9,717.3 కోట్లకు పరిమితమైంది. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ స్థూల రుణభారం రూ.1,98,980 కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని