Budget 2022: నిర్మలమ్మ పద్దులో ‘రియల్‌’ లాభమెంత..?

కరోనా ఉద్ధృతితో తీవ్రంగా నష్టపోయిన దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం గతేడాది కాస్త పుంజుకున్నట్లే కన్పించినా.. ఇప్పుడు ఒమిక్రాన్‌తో థర్డ్‌వేవ్‌ భయాలు మళ్లీ ఈ రంగాన్ని వెంటాడుతున్నాయి

Updated : 25 Jan 2022 17:08 IST

బడ్జెట్‌ వైపు సగటు గృహ కొనుగోలుదారు చూపు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా ఉద్ధృతితో తీవ్రంగా నష్టపోయిన దేశీయ రియల్‌ ఎస్టేట్‌ (Real Estate) రంగం గతేడాది కాస్త పుంజుకున్నట్లే కన్పించినా.. ఇప్పుడు ఒమిక్రాన్‌తో థర్డ్‌వేవ్‌ భయాలు మళ్లీ ఈ రంగాన్ని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే గృహ కొనుగోలుదారుల నుంచి బలమైన డిమాండ్‌ తప్పదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (budget 2022) కోసం అటు రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు.. ఇటు ఇళ్ల కొనుగోలుదారులు (Home Buyers) ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీరికి ఊరట లభిస్తుందా..? నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు..?

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేందుకు ఇటు ప్రభుత్వం.. అటు రిజర్వ్‌ బ్యాంక్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో స్టాంప్‌ డ్యూటీ తగ్గింపుతో పాటు అందుబాటు ధరల్లో గృహాలపై వడ్డీ రాయితీని పథకాన్ని ఈ ఏడాది మార్చి వరకు పొడిగించారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ గృహ రుణాలపై సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేందుకు ఆర్‌బీఐ గత కొంతకాలంగా రెపో రేట్లలో మార్పులు చేయట్లేదు. వీటితో పాటు.. మరిన్ని ఉపశమనాలను రియల్‌ ఎస్టేట్ రంగం వచ్చే బడ్జెట్‌లో కోరుకుంటోంది. సులభతర ఆర్థిక లభ్యతతో పాటు జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వంటివి ఆశిస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపులపై గృహ కొనుగోలుదారులు గట్టిగా దృష్టిపెట్టారు. 

పన్ను రిబేట్‌ పరిమితి పెంచాలి..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 కింద గృహ రుణాల వడ్డీ రేట్లపై గృహ కొనుగోలు దారులు రూ.2లక్షల వరకు పన్ను రిబేట్ పొందుతున్నారు. అయితే దీన్ని కనీసం రూ.5లక్షల వరకు పెంచాలని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఇళ్ల విక్రయాలు ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతుందని, తద్వారా రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. 

అసలు చెల్లింపులపై మరింత ఉపశమనం..

ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద గృహ కొనుగోలుదారులు ఇంటి రుణం అసలు చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందుతున్నారు. ప్రస్తుతం దీనిపై పన్ను మినహాయింపు వార్షిక పరిమితి రూ.1.5లక్షల వరకు ఉంది. హోమ్ లోన్ ప్రిన్సిపల్‌ చెల్లింపులపై మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. గృహ రుణాలపై పన్ను రాయితీని పెంచడం వల్ల ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని.. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి ఎక్కువ మంది ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మినహాయింపు పరిమితిని రూ. 2లక్షల వరకు పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

‘అందుబాటు’ అర్థం మార్చేలా..

సాధారణంగా రూ. 45లక్షల వరకు విలువైన ఇళ్లను ‘అందుబాటు ధరల్లో గృహాలు’గా పరిగణిస్తారు. అయితే ఈ డెఫినిషన్‌ను మార్చి.. రూ.75లక్షల వరకు విలువైన ఇళ్లను దీని కిందకు చేర్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల మరింత మంది ఇళ్ల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారని వారి అభిప్రాయం. ఎందుకంటే.. ఈ పథకం కింద తక్కువ జీఎస్‌టీ, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు వంటి ప్రయోజనాలు అందుతాయి. ప్రస్తుతం అందుబాటు ధరల్లో గృహాలు కొనుగోలు చేసిన వారికి రూ.1.5లక్షల అదనపు వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తోంది. అంటే మొత్తంగా ఈ ఇళ్లపై గరిష్ఠంగా రూ.3.5లక్షల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. మెట్రో నగరాల్లో అయితే ‘అందుబాటు’ పరిమితిని రూ.1.5కోట్ల వరకు పెంచాలని కోరుతున్నారు.

‘అదనపు వడ్డీ’ మరికొంతకాలం..

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేలా అందుబాటు ధరల్లో ఇళ్ల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని 2022 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే దీన్ని మరింత కాలం పెంచితే ఇళ్లకు డిమాండ్‌ లభిస్తుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న బడ్జెట్‌లో కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. 

రియల్‌కు మౌలిక హోదా..

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మౌలిక సదుపాయాల హోదా ఇవ్వాలని గత కొన్నేళ్లుగా అడుగుతున్నా.. ప్రభుత్వం నుంచి దీనికి సానుకూల స్పందన రాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. వీటితో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలపై జీఎస్‌టీని ఎత్తివేయాలని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని 2022 డిసెంబరు 31 వరకు పొడిగించాలని రియల్టర్లు కోరుతున్నారు. 

నిర్మలమ్మ పద్దుపైనే సగటు వేతనజీవి కలల సౌధం ఆధారపడి ఉంది. మరి సొంతింటి కలను నెరవేర్చుకునేలా ప్రభుత్వం ఉపశమనాలు కల్పించి.. రియల్‌ ఎస్టేట్‌కు మరింత ఊతమిస్తుందో లేదో తేలాలంటే.. ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని