Crime news: నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి మృతి; 12మందికి గాయాలు!

రోడ్డు పక్కన నిద్రపోతున్న వలస కూలీల పైనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణాలోని ఝజ్జర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ....

Published : 20 May 2022 01:53 IST

చండీగఢ్‌: హరియాణాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రపోతున్న వలస కూలీల పైనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణాలోని ఝజ్జర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందగా.. 12మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం నిద్రపోతున్న కూలీలపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆ రహదారిపై ప్రమాదకరంగా వాహనాలు తిరుగుతుండటంతో అక్కడ నిద్రపోవద్దంటూ వలస కూలీలకు పెట్రోలింగ్‌ పోలీసు బృందాలు హెచ్చరించిన మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకుంది.

బహదుర్‌గఢ్‌లోని ఆసోడా టోల్‌ప్లాజా సమీపంలో కుండ్లి-మానేసర్‌-పాల్వాల్‌ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అక్కడ 18 మంది కూలీలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్‌ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతులంతా కాన్పూర్‌కు చెందిన వారు కాగా.. గాయపడిన వారిలో యూపీలోని కాన్పూర్‌, కన్నౌజ్‌, ఫరూఖాబాద్‌లకు చెందినవారు ఉన్నారన్నారు. ఓ వంతెన రిపైర్‌ పనులు జరుగుతుండగా పనిచేసేందుకు వచ్చిన వీరంతా రాత్రిపూట రోడ్డుపక్కనే నిద్రపోతుంటారని పోలీసులు తెలిపారు. అయితే, కూలీలు అక్కడే నిద్రిస్తున్నా.. అలాగే వదిలేసిన కాంట్రాక్టర్‌, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని