హాథ్రస్‌ ఘటనలో మనీలాండరింగ్ కోణం!

హాథ్రస్‌ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది.

Published : 07 Oct 2020 02:34 IST

అంతర్జాతీయ కుట్రపై ఈడీ ఆరా

దిల్లీ: హాథ్రస్‌ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది. ‘కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి నిధులు సమకూర్చడం’ వంటి ఆరోపణలు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఆ దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోందని, దర్యాప్తు చేసి,  మనీ లాండరింగ్ కేసు నమోదుచేయొచ్చని వారు తెలిపారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం,  కేంద్రంలో నరేంద్రం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే అంతర్జాతీయ కుట్ర గురించి యూపీ పోలీసులు సూచించినందున ఎన్‌జీఓ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ఉన్న సంబంధంపై ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.  

కాగా, 51 కోట్ల రూపాయాల ఎగుమతి ఆదాయాన్ని పొందారన్న ఆరోపణలతో ఆమ్నెస్టీతో సంబంధం ఉన్న ఒక ప్రైవేటు సంస్థపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు గతవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, కొద్ది రోజుల క్రితం భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఈ మానవ హక్కుల సంస్థ కూడా ప్రకటన చేసింది. ప్రభుత్వం తమ ఖాతాలను స్తంభింపజేసిందని, ఎటువంటి ఆధారాలు లేకుండానే తమను వేటాడుతోందని భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇదిలా ఉండగా, దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసిన హాథ్రస్ ఘటనలో దేశద్రోహం, కుల ఆధారిత కుట్రలకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని