కాల్పుల్లో గాయపడిన జర్నలిస్టు మృతి

దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు విక్రమ్‌ జోషి కన్నుమూశారు. దేశ రాజధాని దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌

Updated : 22 Jul 2020 13:23 IST

ఘజియాబాద్‌: దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు విక్రమ్‌ జోషి కన్నుమూశారు. దేశ రాజధాని దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ విజయనగర్‌ ప్రాంతంలో ఈనెల 20వ తేదీ రాత్రి దుండగులు విక్రమ్‌పై కాల్పులకు తెగబడ్డారు. విక్రమ్‌ జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఓ ముఠా.. దిచక్రవాహనాన్ని అడ్డుకున్నారు. తండ్రీ కూతుళ్లు బైక్‌పై నుంచి కిందపడ్డాక జోషిపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈకేసులో ప్రధాన నిందితుడు సహా దాడికి పాల్పడిననట్టు అనుమానిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా అతని భార్యకు ఉద్యోగంతోపాటు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అజయ్‌ శంకర్‌ పాండే వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై విపక్షాల విమర్శ..

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  రామ రాజ్యాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, గుండా రాజ్యాన్ని ఇచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. తన మేనకోడలిని వేధించేవారిపై చర్యలు తీసుకొమ్మంటూ పోలిసులను ఆశ్రయించినందుకు దుండగులు జర్నలిస్ట్‌ విక్రమ్‌ జోషిని హతమార్చారని అన్నారు. ఆ సందర్భంలో బాధిత కుటుంబానికి రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మరో సీనియర్‌ నేత అభిషేక్‌ సంఘ్వీ కూడా ఈ ఘటన భయాందోళనకు గురిచేసిందన్నారు. అటు, బీఎస్పీ నేత మాయావతి కూడా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వీటిపై శ్రద్ధ చూపాలని అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో న్యాయం కోరడం కూడా నేరంగా మారడం విచారకరమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని