
పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడన్న కోపంతో..
తిరువనంతపురం : తన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడనే కోపంలో ఓ వ్యక్తికి చెందిన దుకాణాన్ని అల్బిన్ మాథ్యూ అనే వ్యక్తి కూల్చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అల్బిన్ మాథ్యూ, సోజీ అనే ఇద్దరు వ్యక్తులు కేరళలోని కన్నూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పక్కపక్క ఇళ్లలో ఉండే వీళ్లిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అల్బిన్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాటిని సోజీ చెడగొడుతున్నాడని అల్బిన్ అతడిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో సోజీ నిర్వహిస్తున్న కిరాణా దుకాణం అసాంఘిక కార్యకాలాపాలకు స్థావరంగా మారిందని అల్బిన్ ఇటీవల ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అయితే దీనిపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోలేదు.
ఓ మళయాల బ్లాక్‌బ్లస్టర్ సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని సోజీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు అల్బిన్. జేసీబీ యంత్రాన్ని తీసుకొచ్చి సొంతంగా సోజీ దుకాణాన్ని కూల్చేశారు. దీనిపై సోజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తానే చర్యలు తీసుకున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.