అదనపు కలెక్టర్‌ నగేశ్‌పై అనిశా ప్రశ్నల వర్షం

మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌ను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. అతని బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే...

Published : 23 Sep 2020 14:19 IST

హైదరాబాద్‌: మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌ను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. అతని బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు.. వాటి గురించి నగేశ్‌ను ప్రశ్నిస్తున్నారు. నగేశ్ బినామీలను కూడా అనిశా ప్రధాన కార్యాలయానికి పిలిపించి.. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. బోయిన్ పల్లిలోని ఆంధ్రా బ్యాంకులో ఉన్న నగేశ్ లాకర్‌ను అనిశా అధికారులు ఈ రోజు తెరిచే అవకాశం ఉంది. అందులో బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నగేశ్‌తోపాటు ఆర్డీవో అరుణా రెడ్డి, తహసీల్దార్‌ సత్తార్‌తోపాటు మరో ఇద్దరిని కూడా అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలని రైతు లింగమూర్తి ఇటీవల అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను సంప్రదించారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న ఆయన.. మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరుమీద అగ్రిమెంట్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. రైతు వద్ద నుంచి తీసుకున్న రూ.40లక్షల నగదును ఎక్కడ ఉంచాడన్నదానిపై అనిశా అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని