అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్‌ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

Updated : 05 Nov 2020 13:22 IST

40 కిలోల గంజాయి స్వాధీనం

నెహ్రూ సెంటర్: నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్‌ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. జిల్లా పరిధిలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఎస్సై సతీష్‌ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వరంగల్‌ వైపు వెళ్తున్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేయగా.. అందులో 40 కిలోల నిషేధిత ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.4లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. కారులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన కలిమేగి గ్రామానికి చెందిన శివశంకర్, మదకమిదుల, సరకార్‌ స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురూ ఒడిశాలో ఎండు గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వరంగల్, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లాలో అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ఎవరూ చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని ఎస్పీ కోటిరెడ్డి హచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాకచక్యంగా వ్యవహరించి స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకున్న కేసముద్రం ఎస్సై సతీష్‌, రూరల్‌ సీఐ వెంకటరత్నం, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని