Saidabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్‌ బాలిక హత్యచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 09 Sep 2022 14:29 IST

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు మృతిని డీజీపీ మహేందర్‌రెడ్డి ధ్రువీకరించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద మృతదేహాన్ని గుర్తించామని.. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. 

ఈనెల 9న సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన తర్వాత నిందితుడిగా ఉన్న రాజు కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఆటోలు, బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టారు. సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.  నిందితుడి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పౌర సమాజం సైతం ప్రతినబూనింది. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుండగానే స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో మృతదేహాన్నిగుర్తించారు. నిందితుడిని అన్ని వైపులా చుట్టుముట్టడంతోనే రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

పోలీసులు అనుమానించినట్లే..

నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశముందని పోలీసులు ముందే భావించారు. రైల్వే ట్రాక్‌లపై గాలింపు చేపట్టడంతో పాటు మార్చురీల్లో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించారు. రైల్వే ట్రాక్‌లపై మృతిచెందిన వారి వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లే  రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.  నిందితుడు రాజు కోణార్క్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని చూసి డయల్‌ 100కు సమాచారం అందించినట్లు చెప్పారు.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని