రూ.కోట్లు విలువ చేసే 60లక్షల గ్లౌజులు చోరీ!

ఇది కరోనా విపత్కాలం. ఇప్పుడు ఏది విలువైంది అంటే.. ఠక్కున ప్రతిఒక్కరూ చెప్పే మాట మాస్కులు, గ్లౌజులు. అవును మరీ.. ఇవి లేకుండా బయటకు వెళ్తే మన ప్రాణాలకు మనమే ముప్పు తెచ్చుకున్న వాళ్లమవుతాం................

Updated : 27 Oct 2020 14:18 IST

కోరల్‌ స్ప్రింగ్స్‌: ఇది కరోనా విపత్కాలం. ఇప్పుడు ఏది విలువైంది అంటే.. ఠక్కున ప్రతిఒక్కరూ చెప్పే మాట మాస్కులు, గ్లౌజులు. అవును మరీ.. ఇవి లేకుండా బయటకు వెళ్తే మన ప్రాణాలకు మనమే ముప్పు తెచ్చుకున్న వాళ్లమవుతాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ రెండు వస్తువులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. వాస్తవానికి కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగే మాస్కులు, గ్లౌజుల కొరత భారీగానే ఉంది. సాధారణంగా ఏది కొరత ఉంటే దొంగల కన్ను దానిపై పడుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పుడు ఇదే జరిగింది. దొంగలు ఏకంగా 60 లక్షల గ్లౌజులు చోరీ చేశారు. వాటి విలువ దాదాపు ఒక మిలియన్‌ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

గత శుక్రవారం రాత్రి కోరల్‌ స్ప్రింగ్స్‌లోని మెడ్‌గ్లవ్‌ అనే సంస్థ కార్యాలయానికి గ్లౌజుల కంటెయినర్‌ చేరుకుంది. ఆదివారం రాత్రి దుండగులు అక్కడి నుంచి ఓ ట్రక్కులో గ్లౌజులను నింపుకొని వెళ్లిపోయారు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న నిఘా కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీనిపై మెడ్‌గ్లవ్‌ ఉపాధ్యక్షుడు రిక్‌ గ్రైమ్స్ మాట్లాడుతూ.. గ్లౌజుల కోసం అనేక ఆస్పత్రులు ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు. వారంతా రోజువారీగా తమ నుంచి కొనుగోలు చేస్తారని వెల్లడించారు. రూ.కోట్లు విలువ చేసే గ్లౌజులు చోరీ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. దొంగతనానికి గురైన గ్లౌజులన్నీ వైద్యపరంగా అత్యంత భద్రమైనవని ధ్రువీకరించినవేనని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని