Published : 13/10/2020 11:13 IST

అదే పెద్దింటి అమ్మాయైతే ఇలాగే చేసేవారా?

హాథ్రస్‌ ఘటనపై పోలీసులకు న్యాయస్థానం సూటి ప్రశ్న

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ కేసును విచారిస్తున్న లఖ్‌నవూ ధర్మాసనం.. ఈ కేసులో అధికారులు, పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక, సామాజిక స్థాయిని ప్రస్తావించిన యూపీ హైకోర్టు.. ‘బాధితురాలు ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఇలాగే ప్రవర్తించి ఉండేవారా’ అంటూ పోలీసుల వైఖరిని ప్రశ్నించింది. ఈ ఘటనలో మృతురాలు హిందువు అయినందున ఆ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారా, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా అనే అంశాల నిర్ధారణ దిశగా సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. 
దళిత యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలతో సెప్టెంబరు 29న దిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా ఆమె మృతదేహాన్ని అదేరోజు రాత్రి స్వగ్రామానికి తరలించిన పోలీసులు.. కుటుంబ సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించటం ప్రశ్నార్థకమైంది. ఈ కేసును న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వీకే శశి న్యాయస్థానానికి తమ వాదనను వివరించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా కోర్టు ఆదేశాలపై విచారణకు హాజరయ్యారు.

ధర్మాసనం ఏమందంటే..

శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే అధికారులు బాధితురాలి అంత్యక్రియలను అదే రోజు అర్థరాత్రి దాటాక చేపట్టాల్సి వచ్చిందని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే ఈ సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. బాధితురాలు పేద కుటుంబం నుంచి కాకుండా.. ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెంది ఉంటే పోలీసులు ఈ విధంగానే ప్రవర్తించేవారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వ యంత్రాంగం పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ కేసుకు అమిత ప్రాధాన్యం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం జీవించే హక్కులో గౌరవాన్ని పొందే హక్కు ఇమిడి ఉందని.. ఇది వ్యక్తుల మృతదేహాలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

సోమవారం నాటి విచారణకు బాధితురాలి కుటుంబ సభ్యులను కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. తమను పోలీసులు వేధిస్తున్నారని.. ఈ కేసును ఉత్తర్‌ ప్రదేశ్‌ పరిధి నుంచి దిల్లీ లేదా ముంబయికి బదిలీ చేయాలని వారు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కాగా, బాధితురాలి తరపున ప్రముఖ న్యాయవాది సీమా కుశ్వాహా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను ఉత్తర్‌ ప్రదేశ్‌ హైకోర్టు నవంబరు 2కు వాయిదా వేసింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని