
హాథ్రస్‌లో మరో ఘోరం: నాలుగేళ్ల చిన్నారిపై..
అత్యాచారానికి ఒడిగట్టిన బంధువు!
లక్‌నవూ: పంతొమ్మిదేళ్ల యువతిపై హత్యాచారం ఘటన మరిచిపోకముందే ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నాలుగేళ్ల ఓ చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబీకులకు అతడు బంధువే కావడం అత్యంత బాధాకరం. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి రుచి గుప్తా వెల్లడించారు. హథ్రస్‌లోని సాన్సి ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చెప్పారు.
‘చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు’ అని బాధితురాలి బంధువొకరు వివరించారు. పని నుంచి సాయంత్రం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు నలుగురు మృగాళ్ల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన హాథ్రస్ యువతి కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. సెప్టెంబర్ 14న తల్లితోపాటు పొలానికి వెళ్లిన ఓ యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 29న మృతిచెందింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్ధరాత్రి 2.15గంటలకు దహన సంస్కారాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ తీరుపై నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అనంతరం ఈ కేసు దర్యాప్తును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.