Army: పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న సైన్యం..!

జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో భారత్‌ సైన్యం ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాది భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సీజవంగా

Updated : 29 Sep 2021 05:30 IST

 పాక్‌ లాంఛ్‌ప్యాడ్ల వద్ద  భారీ సంఖ్యలో ముష్కరులు  

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో భారత్‌ సైన్యం ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాది భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్‌ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు  దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా.. సైన్యం వాటిని విఫలం చేసింది. గత వారం రాంపూర్‌ సెక్టార్‌లో ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.

కశ్మీర్‌ ముస్లింలను వాడుకొంటున్న పాక్‌ ఉగ్రవాదులు..

పాక్‌ ఉగ్రవాదుల వ్యూహాన్ని చినార్‌ కోర్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ  పాండే ఇటీవల వెల్లడించారు. గత కొన్నాళ్ల నుంచి పాక్‌వైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు తగ్గాయని చెప్పారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్‌ ఉగ్రవాదులు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొనరని పాండే తెలిపారు. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా చేసి ప్రాణాలు పోగొట్టుకొనేలా రెచ్చగొడతారన్నారు. ఎన్‌కౌంటర్లలో స్థానికులు మరణిస్తే వారి కుటుంబాలు, బంధువులు, మిత్రులు సైన్యానికి వ్యతిరేకంగా మారతారన్నది పాక్‌ ఉగ్రవాదుల వ్యూహం.

‘పండుగ సీజన్‌ అలర్ట్‌’తో సైన్యం అప్రమత్తం..

భారత్‌లో పండుగ సీజన్‌ సందర్భంగా ఉగ్రదాడులు నిర్వహించేందుకు పాక్‌ యత్నాలు చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌ మద్దతు ఉన్న 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులను ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద నక్యాల్‌ సెక్టార్‌లో సిద్ధంగా ఉంచినట్లు గుర్తించాయి. వీరందరిని పూంచ్‌ నదిలో నుంచి భారత్‌లోకి ప్రవేశపెట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ అన్సార్‌, హిజ్బుల్‌ ముజాహుద్దీన్‌ వంటి సంస్థల కదలికలు కూడా పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని